ఉత్తమ ఫలితాలే లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధన కొనసాగాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా సిలబస్ పూర్తిచేసి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. చదువుతో పాటు విద్యార్థుల నడవడికపై కూడా అధ్యాపకులు దృష్టి సారించాలన్నారు. చెడు వ్యసనాల బారిన పడకుండా, వ్యక్తిత్వ వికాసం పెంపొందేలా శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగితే అడ్మిషన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, మంచినీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమీక్షకు జిల్లాలోని 38 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి(డీఐఈవో) ఎస్.తవిటినాయుడు, ఆర్‌ఐవో పి.దుర్గారావు, ఆర్టీసీ డీఎం శర్మ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment