కాలువ కట్ట మరమ్మతులపై నివేదిక ఇస్తాం
మఠంపల్లి: వేములూరు రిజర్వాయర్ ఎడమ కాలువ కట్ట మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని నీటిపారుదల చీఫ్ ఇంజనీర్ ఓబీ రమేష్ అన్నారు. మండలంలోని యాతవాకిల్ల వద్ద గల చిన్న నీటి పారుదల ప్రాజెక్టు అయిన వేములూరు రిజర్వాయర్ ఎడమ కాలువ కట్ట బలహీనంగా ఉండడంతో ఇటీవల వర్షాలు వచ్చిన సమయంలో కట్ట పలుచోట్ల తెగింది. దీంతో వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈవిషయమై ఈ నెల 27న సాక్షి దినపత్రికలో ‘బలహీనంగా వేములూరు కాలువ కట్ట’ అనే కథనం ప్రచురితమైంది. స్పందించిన నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నీటిపారుదల చీఫ్ ఇంజనీర్ ఓబీ రమేష్, ఎస్‌ఈ ధర్మతేజ, ఈఈ రామ్‌కిశోర్, డీఈ భిక్షం, ఏఈ శ్రీనివాస్ బృందం వేములూరు రిజర్వాయర్‌ను, ఎడమ కాలువ కట్టను పరిశీలించారు. అనంతరం సీఈ రమేష్ మాట్లాడుతూ ఎడమ కాలువ కట్టను వరదాపురం వద్ద వెంకటనరసయ్య మిల్లు నుంచి మంచ్యాతండా రైల్వే బ్రిడ్జి వరకు, అదేవిధంగా వేములూరు రిజర్వాయర్ కట్ట నుంచి వెంకటనరసయ్య మిల్లు వరకు పరిశీలించామన్నారు. కట్ట మరమ్మతుల విషయమై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. కాగా మంచ్యాతండా మాజీ ఉప సర్పంచ్ చంద్రునాయక్, నాయకులు మాలోతు బాలునాయక్ తదితరులు కాలువ కట్టకు సాధ్యమైనంత తొందరగా మరమ్మతులు, సీసీ లైనింగ్ పూర్తి చేయాలని అధికారులను కోరారు. వారి వెంట వర్క్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, లస్కర్లు కోటాలు, నరసింహ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment