వెలగని దీపాలు.. కమ్ముకున్న చీకట్లు
కోదాడ: కోదాడ మున్సిపాలిటీలోని చాలా వీధులు అంధకారంలో మగ్గుతున్నాయి. కాంట్రాక్టర్‌కు ప్రతినెలా లక్షల రూపాయలు బిల్లులు చెల్లిస్తున్నా వీధుల్లో మాత్రం వీధిదీపాలు వెలగడం లేదు. ఏకంగా నాలుగు వేల వీధిదీపాలు ఏడాది కాలంగా వెలగడం లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానిక అధికారులు మాత్రం వీధిదీపాల కాంట్రాక్ట్ రాష్ట్ర స్థాయిలో జరిగిందని, లైట్ల నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడంతో సంవత్సరం నుంచి వారికి బిల్లులు చెల్లించలేదంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో వీధిదీపాలు వెలగక పోవడంతో తాము వార్డుల్లో తిరిగే పరిస్థితి లేదని, వెంటనే వీధిదీపాలు వేయించాలని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వారం రోజులు క్రితం పలువురు కౌన్సిలర్లు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె మున్సిపల్ అధికారులను పిలిచి అసలు ఏమి జరిగిందో తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మున్సిపల్ అధికారుల వద్ద దీనికి సంబంధించిన వివరాలే లేకపోవడం గమనార్హం. ఎమ్మెల్యే ఆదేశాలతో ప్రస్తుతం అధికారులు ఫైళ్లు వెతికే పనిలో పడ్డారు.
రాష్ట్ర స్థాయిలోనే ఒప్పందం..
కోదాడ మున్సిపాలిటీలో వీధిదీపాల నిర్వహణకు సంబంధించి 2017లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) సంస్థతో ఏడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం పట్టణంతా ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయాలి. ఏడేళ్లపాటు కాలిపోయే లేదా వెలగని వీధిదీపాలను ఈ సంస్థవారే మార్చాలి. దీనికోసం మున్సిపాలిటీ సదరు సంస్థకు డబ్బులు చెల్లించాలి. ఇక మున్సిపాలిటీలో వీధిదీపాల నిర్వహణకు సదరు సంస్థ ఏడుగురు సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. ఈ సంస్థతో ఒప్పందం కుదిరినా వీరు కొంత మందికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం, వారు మున్సిపాలిటీకి చెందిన ప్రజాప్రతినిధుల భర్తలకు మరోసారి సబ్‌కాంట్రాక్ట్ ఇవ్వడంతో మొత్తం వ్యవహారం గాడి తప్పింది. ఈ కాంట్రాక్ట్ కాలపరిమితి నేటితో (గురువారం) ముగియనుంది. కాంట్రాక్ట్ ముగిసే సమయానికి పట్టణంలో మొత్తం వీధిదీపాలను వెలిగించి ఇవ్వాలి. కానీ ప్రస్తుతం పట్టణంలో 4 వేలకుపైగా వీధిదీపాలు వెలగని పరిస్థితి నెలకొంది.
ప్రధాన రహదారిలో పట్టపగలే..
కోదాడ పట్టణంలో ప్రధాన రహదారి పొడవునా రాత్రి సమయంలో వందల లైట్లు వెలగడం లేదు. మరోపక్క పట్టణంలోని పలు వీధుల్లో ఉన్న కొన్ని లైట్లు రాత్రి పగలు తేడాలేకుండా వెలుగుతూనే ఉన్నాయి. వీటి గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే దిక్కు లేకుండా పోయింది. సెప్టెంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలకు పలుచోట్ల డివైడర్లను పగలకొట్టారు. దీంతో వీధిదీపాల వైర్లు తెగిపోయాయి. వీటిని మరమ్మతులు చేయక, కాలిపోయిన వాటిని నెలల తరబడి మార్చకపోవడంతో పట్టణంలో ప్రధాన రహదారి చీకటిమయంగా మారుతోంది.
బిల్లులు నిలిపివేశాం
కోదాడ మున్సిపాలిటీలో వీధిదీపాల కాంట్రాక్టర్ గడిచిన కొంత కాలంగా సక్రమంగా పనిచేయడం లేదు. అందుకే బిల్లులు చెల్లించడం నిలిపివేశాం. ఆఖరిసారిగా గతేడాది అక్టోబర్ నెలకు రూ.13 లక్షలు చెల్లించాం. కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే వద్దకు పిలిపించి మొత్తం వివరాలను త్వరలోనే చెబుతాం.
– సాయిలక్ష్మి, డీఈ, కోదాడ మున్సిపాలిటీ
పలు కాలనీల్లో వెలగని వీధిదీపాలు
కొన్నిచోట్ల రాత్రింబవళ్లూ వెలుగులే..
ఇబ్బందుల్లో పట్టణ వాసులు
నేటితో ముగియనున్న
కాంట్రాక్ట్ కాలపరిమితి
ఏడేళ్ల క్రితం కాంట్రాక్టర్ వేసిన వీధిలైట్లు
12,450
ప్రస్తుతం వెలగనివి 4,000
ప్రతినెలా మున్సిపాలిటీ చెల్లిస్తున్న
బిల్లు రూ.13 లక్షలు
నెలకు రూ.13 లక్షలు చెల్లిస్తున్నా..
ఒప్పందం కుదిరిన సంవత్సరం మొదటి నెల రూ.2.20లను సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించిన కోదాడ మున్సిపాలిటీ అధికారులు సదరు చెల్లింపులు పెంచుకుంటూ వచ్చి గతేడాది అక్టోబర్ నెలలో నెలకు రూ.13 లక్షలను వీధిదీపాల కోసం చెల్లించారు. ఈ చెల్లింపులు ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయి.? అసలు ఒక్కో వీధిదీపానికి ఎంత చెల్లిస్తున్నారు? సంస్థ ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారా లేదా..? ప్రస్తుతం ఎన్ని లైట్లు ఉన్నాయి..? ఎన్ని వెలగడం లేదు..? అనే కనీస సమాచారం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది వద్ద లేదు. గడిచిన ఏడేళ్లలో కోదాడ పట్టణంలో ఎన్నో శివారు కాలనీలు ఏర్పడ్డాయి. వాటిలో ఎన్ని లైట్లు వేశారనే కనీస సమాచారం లేకుండా పోయింది. ప్రస్తుత మున్సిపాలిటీ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ అధికారులు తాము కొత్తగా వచ్చామని, తెలుసుకొని చెబుతామని కాలం గడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment