నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
సూర్యాపేటటౌన్ : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలపాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాల సహకారంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు సమాజంలో రక్షణగా పని చేస్తాయన్నారు. ప్రజలు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వేధింపులు జరగకుండా, వేగంగా వెళ్లే వాహనాలను, ఆకతాయిలను అరికట్టడంలో ఈ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ఏవైనా సంఘటనలు, తగాదాలు, నేరాలు జరిగినప్పుడు అనుమానితులు, నిందితులను గుర్తించడానికి తోడ్పడతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలన్నారు. యువత, విద్యార్థులు చెడు అలవాట్లకు, చెడు ప్రలోభాలకు దూరంగా ఉండాలని, కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం పోలీసు కళాజాతా బృందం సభ్యులు పాటలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవి, పట్టణ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐలు కుశలవ, ఏడుకొండలు, వెంకట్‌రెడ్డి, విరాళాలు అందించిన విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment