శివాలయాల్లో ఘనంగా ప్రదోష పూజలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని ఆలయాల్లో ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ప్రదోష పూజలను నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్ద నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని హరోంహర నామస్మరణల మధ్య, శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూరహారతులు పట్టారు. అనంతరం స్వామివార్లను అధికార నంది వాహనంలో కొలువుదీర్చి మాడ వీధుల్లో మేళ తాళాల నడుమ ఊరేగించారు. అలాగే వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కాయకూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్‌కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట వంటి జిల్లాల్లోని శివాలయాల్లోని నంది భగవాన్‌కు పూజలు చేసి ప్రార్థనలు జరిపారు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరాలయంలో ప్రతి నెలా పౌర్ణమి రోజున ఆలయం కొండ చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల దూరం గిరివలయం వెళ్లడం ఆనవాయితీ. దీంతో ఆలయ నిర్వాహకులు గిరివలయం వెళ్లేందుకు సమయాన్ని విడుదల చేశారు. అందులో భాగంగా శుక్రవారం వేకువ జామున 5.43 ప్రారంభించి 16వ తేదీన 3.30 గంటల వరకు పౌర్ణమి ఉండడంతో ఆ సమయంలో భక్తులు గిరివలయం వెళ్లవచ్చని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment