ధన్వంతరిలో పౌర్ణమి యాగ పూజలు
వేలూరు: వాలాజలోని శ్రీధన్వంతరి ఆరోగ్య పీఠంలో తమిళ ఐపసి మాస పౌర్ణమిని పురస్కరించుకుని లోక క్షేమం కోసం ప్రత్యేక యాగ పూజలు నిర్వహించారు. స్వామివారికి అన్నాభిషేకం చేశారు. ముందుగా పీఠాధిపతి మురళీధర స్వామీజీ ఆధ్వర్యంలో పీఠంలో గణపతి పూజ, గోపూజ నిర్వహించారు. అనంతరం మహా ధన్వంతరి పెరుమాళ్‌కు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణ, దీపారాధన పూజలు చేశారు. అనంతరం పీఠంలో ఈశ్వరునికి, శ్రీఏకరవు రాహుకేతులకు అన్నాభిషేకం నిర్వహించారు. లోక క్షేమం కోసం ప్రత్యేక యాగ గుండంలో వనమూలికలు, పట్టు వస్త్రాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని వేసి లోకంలోని ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుతూ వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ మధ్య ప్రత్యేక యాగ పూజలు చేశారు. అదే విధంగా పీఠంలోని 468 సిద్ధ లింగాలకు ప్రత్యేక అభిషేకాలు చేసి పుష్పాలంకరణ, దీపారాధన పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. తమిళ ఐపసి మాసం ఆఖరి రోజు పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. యాగ పూజల్లో పాల్గొన్నారు.
శివాలయాల్లో అన్నాభిషేకం
పళ్లిపట్టు: పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లోని శివాలయాల్లో అన్నాభిషేకం వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. పళ్లిపట్టు బస్టాండు సమీపంలోని పార్వతి సమేత శ్రీసంఘమేశ్వర స్వామి ఆలయంలో అన్నాభిషేకం సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామి విశేష పూజలు జరిగాయి. అన్నం, పండ్లు, కూరగాయలతో శివలింగం ప్రతిష్టించి మహాదీపారాధన పూజలు చేపట్టారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అన్నం. పండ్లు, కూరగాయలతో ప్రతిష్టించిన శివిలింగాన్ని ప్రసాదంగా భక్తులుకు పంపిణీ చేశారు. అలాగే ఆలయ నిర్వాహకులు వెయ్యి మందికి అన్నదానం చేశారు. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగ చెంచమ్మ కోనలో కొలువైన శ్రీసదాశివ లింగేశ్వరస్వామి ఆలయంలో అన్నాభిషేకం పూజలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అన్నాభిషేకం సందర్భంగా ఆలయాల్లో భక్తజనం రద్దీ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment