సహకార బ్యాంకులతోనే అభివృద్ధి
వేలూరు: సహకార బ్యాంకుల ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అభివృద్ధి చెందగలరని మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని ప్రైవేటు కల్యాణ మండపంలో కోఆపరేటివ్ 71వ వారోత్సవాలు కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంలోనే ఈ శాఖకు అధిక నిధులు కేటాయించామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందజేయడంతోపాటు వాటికి ఎన్నికలు నిర్వహించామన్నారు. ప్రస్తుతం సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రజలకు వారధులుగా నిజాయితీతోపాటు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు. నిరుపేద రైతులను ఆదుకునేందుకు సహకార సంఘాలు అనేక రకాలైన సహాయ సహకారాలు అందజేస్తాయన్నారు. వీటిని దుర్వినియోగం చేయకుండా అర్హులైన వారికి అందే విధంగా చూడాలన్నారు. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులు వాటిని తిరిగి చెల్లించేందుకు ఆసక్తి చూపాలని అప్పుడే ఇతరులకు రుణాలు ఇచ్చేందుకు కుదురుతుందని తెలిపారు. ఎన్నికల నాటికి రుణమాఫీ చేస్తారని రైతులు అనుకోకుండా రుణాలను తిరిగి చెల్లించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో సహకార సంఘాల ద్వారా రూ.1,051 కోట్ల 41 లక్షలు విలువ చేసే పంట రుణాలతోపాటు మహిళా సంఘాలకు రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కార్తికేయన్, నందకుమార్, అములు, జడ్పీ చైర్మన్ బాబు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్ కోఆపరేటివ్ బ్యాంకు జాయింట్ రిజిస్ట్రార్ తిరుగుణ అయ్యప్పదురై తదితరులు పాల్గొన్నారు. అనంతరం గుడియాత్తం డివిజన్‌లోని నిరుపేదలకు ఇంటి పట్టాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment