ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా
● స్వల్ప గాయాలతో బయట పడ్డ విద్యార్థులు
వేలూరు: తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇందులో జోలార్‌పేటతోపాటు చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుంచి 700 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులను గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చేందుకు పాఠశాల యాజమాన్యం బస్సు వసతి ఏర్పాటు చేసింది. బస్సు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులను తీసుకెళ్లేది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పాఠశాల నుంచి ఒక బస్సు జోలార్‌పేట సమీపంలోని పుత్తుకోయిల్ ప్రాంతానికి వెళ్లి 25 మంది విద్యార్థులను ఎక్కించుకొని తిరుగు పయనమైంది. సోతాన్‌పేట వద్ద వస్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి వెంటనే కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయయి. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. విద్యార్థుల అరుపులు విన్న ఆ ప్రాంతవాసులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జోలార్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను చికిత్స నిమిత్తం జోలార్‌పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను మరొక బస్సులో పాఠశాలకు పంపారు. బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా ప్రభుత్వాసుపత్రి వద్దకు, పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment