అన్నానగర్: చైన్నె సమీపంలోని తాంబరం నాథముని కోవిల్ వీధికి చెందిన సుఖిత (46). ఈమె సోదరి సుగంద కుమారుడు రితీష్ అనారోగ్యంతో కిల్పాక్కం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. శస్త్ర చికిత్స కోసం సుఖిత రూ.3 లక్షలు తీసుకుని ఆటో డ్రైవర్ అయిన తన సోదరుడు లూర్దు రాజ్‌తో కలిసి ఆటోలో వెళ్లింది. అమందైకరై పూందమల్లి హైవేలో ఉన్న ఓ హోటల్ ముందు ఆటో ఆపి ఆహారం కొనుక్కోవడానికి సుఖిత లోపలికి వెళ్లింది. ఆటోలో అతని సోదరుడు లూర్దురాజ్ ఒక్కడే ఉన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటో వెనుక చక్రం దగ్గర రూ.10 పడి ఉన్నాయని లూర్దురాజ్‌కు చెప్పారు. వెంటనే లుర్దురాజ్ రూ. పది నోటు తీసుకొవడానికి దిగాడు. ఆ సమయంలో దుండగులు రూ.3 లక్షలను అపహరించారు. ఈ విషయాన్ని తన సోదరికి చెప్పాడు. దీంతో షాక్‌కు గురైన సుఖిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమందైకరై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసు కమిషనర్‌కు 391 ఫిర్యాదులు
కొరుక్కుపేట: ప్రతి బుధవారం నిర్వహించే ప్రజావాణిలో పోలీస్ కమిషనర్ అరుణ్ వ్యక్తిగతంగా ఇప్పటివరకు 391 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంటూ అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్, పోలీసు కమిషనర్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.స్టాలిన్ శాసనసభలో ప్రకటించారు. ఆమేరకు పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన చైన్నె పోలీస్ కమిషనర్ అరుణ్ ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తూ పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల శిబిరంలో పోలీస్ కమిషనర్ అరుణ్ స్వయంగా ప్రజలను కలుసుకుని వారి నుంచి అర్జీలను స్వీకరించి, విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు. అందుకు సంబంధించి జులై 8 నుంచి నవంబర్ 20 వరకు 391 అర్జీలు రాగా 292 అర్జీలను పరిష్కరించారు. జూలై 2018 నుంచి ప్రతి బుధవారం ప్రజలను కలుసుకుని వారి ఫిర్యాదులను నేరుగా వింటున్నారు.
ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన భర్త అరెస్ట్
కొరుక్కుపేట: కుటుంబ కలహాల కారణంగా విడిపోయిన భార్య పేరుతో ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన భర్తను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..శివగంగ సమీపంలోని ఉదయమేలూరు గ్రామానికి చెందిన కాళీముత్తు (36)కు వివాహమై 15 ఏళ్లు అవుతోంది, వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో కాళీముత్తు తన భార్య పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతా ప్రారంభించి, దాని ద్వారా అసభ్యకర సమాచారాన్ని పోస్ట్ చేసి అందులో తన భార్య సెల్ నంబర్‌ను పేర్కొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య శివగంగ జిల్లా ఎస్పీ తొంగరేప్రవీన్ ఉమేష్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె అభ్యర్థన మేరకు సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ చంద్రమోహన్, సబ్‌ఇన్‌స్పెక్టర్ మురుగానందం ఈ మేరకు విచారణ జరిపి కాళీముత్తును అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment