గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలి
వేలూరు: క్రీడాకారులు గెలుపు, ఓటమిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో పాల్గొనాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఏవావేలు అన్నారు. తిరువణ్ణామలైలోని క్రీడామైదానంలో తమిళనాడు హ్యాండ్ బాల్ అసోషియేషన్, తిరువణ్ణామలై హ్యాండ్ బాల్ అసోషియేషన్ సంయుక్తంగా రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహమతుల ప్రదానోత్సవ కార్యక్రమం కలెక్టర్ భాస్కర పాండియన్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేసి ప్రసంగించారు. తిరువణ్ణామలై జిల్లాలోని గ్రామాల్లో ఎక్కువగా క్రీడాకారులున్నారని, వారిని గుర్తించి ఇదివరకే అవసరమైన శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపుతున్నామన్నారు. ముఖ్యంగా జవ్యాదికొండ ప్రాంతాల్లో నివశిస్తున్న వారిలో అధికంగా క్రీడాకారులు దాగి ఉన్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి జిల్లా స్థాయిలో అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కొంతమంది విజయం సాధించినప్పటికీ, పలువురు ఓటమి చెంది ఉంటారని క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజమని తెలిపారు. వాటికి నిరుత్సాహ పడకుండా పట్టుదలతో ప్రయత్నం చేసి విజయ శిఖరాలకు చేరుకోవాలన్నారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసమని ప్రతిఒక్కరూ క్రీడల్లో పాల్గొనేందుకు ఆశక్తి చూపాలన్నారు. అనంతరం క్రీడాకారులను అభినందించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, పార్లమెంట్ సభ్యులు అన్నాదురై పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment