రాజకీయాల్లో నటుల పాత్ర నామమాత్రమే
తిరువళ్లూరు: రాజకీయాల్లో సినీనటుల పాత్ర నామమాత్రంగానే మిగిలిపోతుందని అన్నాడీఎంకే సీనియర్ నేత మాజీ మంత్రి షణ్ముగం స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే ముఖ్యనేతల సమావేశం పట్టణంలోని ఓ ప్రైవేటు హాలులో జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి అన్నాడీఎంకే జిల్లా కన్వీనర్ రమణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, జయకుమార్ తదితరులు హాజరై 2026లో జరగనున్న ఎన్నికలకు సిద్ధం కావడంపై క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు సివీ షణ్ముగం మాట్లాడుతూ రాజకీయాల్లో సినీనటులు సీమాన్, కమల్‌హాసన్, టీ రాజేంద్రన్‌తో పాటు పలువురు వచ్చారు. నేటి రాజకీయాల్లో వారు నామమాత్రంగా మిగిలిపోయారు. నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చినా ప్రయోజనం ఉండదు. యువకులు పెద్ద ఎత్తున విజయ్ పార్టీలోకి వెళ్తున్నారని అన్నాడీఎంకే నేతలు ఆందోళన చెందవద్దు. విజయ్‌ను చూడడానికే మహానాడుకు వచ్చారు. అతడికి ఓటు మాత్రం వేయరు. కనీసం ప్రతి బూత్‌లోనూ ఇద్దరు ఏజెంట్లును కూర్చోబెట్టే సామర్థ్యం విజయ్‌పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. మహానాడుకు వచ్చిన జనాన్ని చూసి తమకు బలం ఉందని విజయ్ అనుకుంటే రాజకీయ పరిజ్ఞానం లేన్నట్టేనన్నారు. అనంతరం మరో మాజీ మంత్రి జయకుమార్ మాట్లాడుతూ తమ పార్టీ అదానీ సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి లంచం తీసుకున్నట్టు డీఎంకే నేతలు ఆరోపించడం అవివేకమన్నారు. అదానీ నుంచి లంచం తీసుకున్నట్టు చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని డీఎంకే నేతలకు సవాల్ విసిరిరారు. 2026 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడానికి నేతలు కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీ హరి, మాజీ ఎమ్మెల్యే సక్కుబాయ్, పార్టీ నేతలు పళ్లిపట్టు టీడీ శ్రీనివాసన్‌తో పాటు పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు.
మాజీ మంత్రి సీవీ షణ్ముగం
Comments
Please login to add a commentAdd a comment