తమిళసినిమా: వివాహ బంధంపై నమ్మకం లేదని చెప్పేవారు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారని చెప్పవచ్చు. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే నటీమణుల్లో కొందరు 30, 40 ఏళ్లు దాటినా పెళ్లిపై అనాసక్తిని కనబరుస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో నటి త్రిష, శృతిహాసన్ వాళ్లు ఉండటం విశేషం. తాజాగా ఈ పట్టికలో నటి ఐశ్వర్య లక్ష్మి చేరారు. ఈ మలయాళీ భామ పలు చిత్రాల్లో కథానాయకిగా నటించారు. నిర్మాతగానూ రాణిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు ఈ అమ్మడు సుపరిచితమే. నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన జగమే తందిరం చిత్రంలోనూ, విష్ణువిశాల్ హీరోగా నటించిన కట్టా కుస్తీ చిత్రంలోనూ నాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారు. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న థగ్‌లైఫ్ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. ఇకపోతే మలయాళంలోనూ కథానాయకిగా బిజీగా ఉన్నారు. ఈమె నటించిన హలో మమ్మీ అనే మలయాళ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. కాగా నటి ఐశ్వర్యలక్ష్మీ వయసు ఇప్పుడు 34 ఏళ్లు. ఇప్పటికీ ఆమె అవివాహితే. కాగా ఇటీవల ఓ భేటీలో వివాహం పలు విషయాలపై ఐశ్వర్య లక్ష్మి స్పందించారు. ‘నాకు వివాహ బంధంపై నమ్మకం లేదు. 8, 10, 25 ఏళ్ల వయసుల్లో వివాహం అనేది నాకు ఒక కల. గురువాయూర్ ఆలయంలో వివాహం చేసుకున్నట్లు ఊహించుకున్నాను కూడా. అయితే నేను ఎదిగిన తరువాత పెళ్లిపై నా అభిప్రాయం మారింది. చాలా ఆలోచించిన తరువాత ఒక నిర్ణయానికి వచ్చాను. అందుకు కారణం నా చుట్టూ ఉన్న స్నేహితుల్లో పెళ్లి చేసుకున్నవారెవరూ ప్రశాంతంగా లేరు. చాలా తక్కువ మంది మాత్రమే నిజమైన సంతోషాన్ని అనుభవిస్తున్నారు. నాకిప్పుడు 34 ఏళ్లు. నా తల్లి పెళ్లి చేసుకోమని చెప్పడంతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయమని చెప్పాను. అమ్మ అలానే చేసింది. అయితే ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌ను చూసిన వారు ఇది నా మ్యాట్రిమోనీ సైట్ అంటే నమ్మడం లేదు’ అని నటి ఐశ్వర్యలక్ష్మి పేర్కొన్నారు.
నటి ఐశ్వర్య లక్ష్మీ
Comments
Please login to add a commentAdd a comment