గ్రామసభలతోనే సమస్యలకు పరిష్కారం
వేలూరు: గ్రామసభల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. గ్రామ పంచాయతీల దినోత్సవాన్ని పురష్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలోనూ గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులోభాగంగా వేలూరు జిల్లా ఆర్కాడు నియోజకవర్గం పరిధిలోని వల్లం గ్రామపంచాయతీ కలెక్టర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని వివిధ సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించి వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఆమె మాట్లాడుతూ గ్రామసభల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పలు సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. గ్రామ పంచాయతీల దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించాలని ఆదేశించామని తెలిపారు. సమస్యలను ఆయా సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు తెలియజేసి వాటిలో అర్హులైన వారికి పథకాలను అందజేస్తామన్నారు. కొన్నింటిని సంబంధిత అధికారులతో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం వల్లం గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్యతోపాటు పింఛన్ల కోసం అనేక మంది వినతి పత్రాలు సమర్పించారని వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామసభలో ఎమ్మెల్యే ఈశ్వరప్పన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా కాట్పాడి తాలుకా అమ్ముండి, పెరుముగై, వంటి పంచాయతీల్లో ఆయా సర్పంచ్‌ల అద్యక్షతన గ్రామసభ నిర్వహించారు. వీటిలో అధికంగా పింఛన్లకు సంబంధించి వినతులు రావడంతో వాటిని ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment