సాక్షి, చైన్నె: చైన్నెలోని ఓ మహిళా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీఐజీ)ను డిజిటల్ అరెస్టు చేయడానికి ఓ యువకుడు ఫోన్ కాల్ బెదిరింపు ఇచ్చాడు. అప్రమత్తమైన ఆమె ఆ కాల్‌ను కట్ చేసి , సైబర్ క్రైంకు ఫిర్యాదు చేయడంతో ఆ నిందితుడి కోసం తీవ్ర అన్వేషణ సాగుతోంది. వివరాలు.. ఇటీవల కాలంగా తమిళనాట ముంబై పోలీసులు అని కొన్ని సందర్భాలలో, సీబీఐ, ఈడీ అంటూ ఫోన్ కాల్ బెదిరింపులు పెరుగుతున్నాయి. గత వారం చైన్నె తిరువాన్మీయూరుకు చెందిన రిటైర్డ్ అధికారి ఒకరిని ముంబై పోలీసుల పేరిట బెదిరించి డిజిటల్ అరెస్టు చేసి రూ. 88 లక్షలను ఓ యువకుడు అపహరించాడు. ఈ ఘటనను తీవ్రంగా చైన్నె సైబర్ క్రైం విచారించి అస్సోంకు చెందిన పార్ధా ప్రదీప్ బోరా అనే యువకుడిని అరెస్టు చేశారు. రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్టు చేసిన రోజే మరి కొందరిని ఇలాగే బెదిరించి ఆ యువకుడు రూ. 3.82 కోట్లు దోచుకున్నట్లు విచారణలో తేలింది. ఈ మొత్తాన్ని అతడు 178 బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసినట్లు తేలడంతో ఆ ఖాతాలపై చైన్నె సైబర్ క్రైం దృష్టి పెట్టి విచారిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం రాత్రి చైన్నెలో ఉన్న మహిళా డీఐజీకి ముంబై సైబర్ క్రైం అంటూ బబెదిరింపు కాల్ వచ్చింది. ఆమె ఆధార్ నెంబర్‌ను పేర్కొంటూ, మాధక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, మిమ్మల్ని విచారించాల్సి ఉందంటూ కాల్ చేసిన వ్యక్తి బెదిరించడంతో తనను డిజిటల్ అరెస్టు చేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు అప్రమత్తమైన ఆ మహిళా పోలీసు అధికారిణి ఆ కాల్‌ను కట్ చేసేశారు. తక్షణం చైన్నె చెట్‌పట్‌లోని సైబర్ క్రైం ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కాల్‌ను ఓ యువకుడు చేసినట్టు గుర్తించినా, నెట్ వర్క్ పరంగా అనేక చోట్ల కాల్ వచ్చినట్టుగా చూపిస్తుండడంతో ఈ డిజిటల్ నేరగాళ్లపై పోలీసులు నిఘా విస్తృతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment