ఈరోడ్ ఎన్నికల అధికారి మార్పు
సాక్షి, చైన్నె : ఈరోడ్ తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం మనీష్‌ను తప్పించారు. ఆయన స్థానంలో కొత్త అధికారిగా హెచ్‌ఎస్ శ్రీకాంత్ నియమితులయ్యారు. వివరాలు.. ఈవీకేఎస్ మరణంతో ఖాళీగా ఉన్న ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకే, తమిళగ వెట్రి కళగం ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో ప్రధాన పోటీ అన్నది డీఎంకే అభ్యర్థి చంద్రకుమార్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి సీతాలక్ష్మి మధ్య పోటీ నెలకొంది. వీరితో పాటుగా 46 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఈరోడ్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న ఎం మనీష్ వ్యవహరిస్తూ వచ్చారు. అయితే, ఓ నామినేషన్ తీవ్ర వివాదానికి గురి కావడం పెద్ద చర్చకే దారి తీసింది. బెంగళూరుకు చెందిన పద్మావతి నామినేషన్ వివాదం పుణ్యమా తుది జాబితాను ఆలస్యంగా ప్రకటించారు. ఈ పరిణామాలు మనీష్ నెత్తిన పడ్డట్లయ్యింది. ఆయన్ని ఎన్నికల పనుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో హోసూరు కమిషనర్‌గా ఉన్న శ్రీకాంత్‌ను నియమించారు. బుధవారం ఈరోడ్‌కు చేరుకున్న శ్రీకాంత్ కమిషనర్‌తో పాటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాధ్యతలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల పర్యవేక్షణాధికారులతో కలిసి ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. గురు లేదా శుక్రవారం నుంచి పోస్టల్ ఓట్ల పై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్ ఓట్లు నమోదు చేయదలచుకుంటే అధికారులకుసమాచారం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఎలాంటి విబేదాలు లేవు అని, అందరూ కలిసి కట్టుగా అభ్యర్థిగెలుపు కోసం శ్రమిస్తున్నారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై పేర్కొన్నారు. ఈరోడ్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీఎంకే – కాంగ్రెస్‌ల బంధం గట్టిదని, విభేదాలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment