గుర్తింపు రద్దు తథ్యం
● కళాశాలలకు అన్నావర్సిటీ హెచ్చరిక ● సమగ్ర వివరాల సమర్పణకు ఆదేశం
సాక్షి, చైన్నె : తన పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలకు అన్నావర్సిటీ తీవ్ర హెచ్చరికలతో బుధవారం ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. సమగ్ర వివరాలను సమర్పించని పక్షంలో గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. వివరాలు.. రాష్ట్రంలో అన్నా వర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలు ఉన్న విషయం తెలిసిందే. కౌన్సెలింగ్‌కు ముందుగా ఆయా కళాశాలలో తమ వద్ద ఉన్న కోర్సులు, సౌకర్యాలు, అధ్యాపక సిబ్బంది సంఖ్య తదితర వివరాలతో పాటూ సమగ్ర సమాచారాలను అన్నావర్సిటీ ద్వారా ఏఐసీటీఈకి పంపించాల్సి ఉంటుంది. ఈ మేరకు గత ఏడాది కూడా ప్రైవేటు కళాశాలల నుంచి వివరాలతో కూడిన నివేదిక అన్నావర్సిటీకి చేరింది.
అదే సమయంలో అరప్పోర్ ఇయక్కం నకిలీ అధ్యాపకులు అంటూ ఆధారాలను బయట పెట్టడం చర్చకు దారి తీసింది. ఒక చోట పనిచేసే అధ్యాపకుడు మరో చోట కూడా పనిచేస్తూ వస్తున్నట్టుగా, నకిలీ ఆధార్ కార్డుల ను ఉపయోగించి అధ్యాపక సిబ్బంది పూర్తి స్థాయిలో తమ వద్ద పనిచేస్తున్నట్టుగా కళాశాలలు మాయాజాలం సృష్టించినట్టు వచ్చిన ఆరోపణలను గవర్నర్ ఆర్‌ఎన్ రవి సైతం తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారం పెద్ద చర్చకే దారి తీయడంతో విచారణ బృందం రంగంలోకి దిగింది. మాయాజాలం సృష్టించిన కళాశాలలను, ప్రొఫెసర్లను గుర్తించి చర్యలు చేపట్టారు. ఇది పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలపై అన్నావర్సిటీ దృష్టి పెట్టింది.
ప్రత్యేక ఆదేశాలు..
అన్నావర్సిటీ రిజిస్ట్రార్ ప్రకాశ్ బుధవారం ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆరు, ఏడవ వేతన కమిషన్ సిఫారసుల మేరకు ఆయా కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించాలని ఆదేశించారు. 2025–26 సంవత్సరానికి గాను ఆయా కళాశాలలో సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌కు సంబంధించిన అనుమతుల వ్యవహారం నివేదికలో సమగ్ర వివరాలను ఉండాలని సూచించారు. ఈనెల 31లోపు జరిమానా లేకుండా, ఫిబ్రవరి 7వ తేదీ నాటికి జరిమానాతో గుర్తింపునకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలని వివరించారు. ఆయా కళాశాలలకు సంబంధించిన సమగ్ర వివరాలు సరిగ్గా లేని పక్షంలో గుర్తింపు అన్నది తక్షణం రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. వివరాలన్నీ సక్రమంగా ఉండే విధంగా, గోప్యతకు అవకాశం ఇవ్వకుండా అన్ని బహిర్గతంగా ఉండే రీతిలో సమర్పించాలని సూచంచారు.
Comments
Please login to add a commentAdd a comment