మంత్రి కిషన్‌రెడ్డితో అరిటా పట్టి వాసుల భేటీ
– నేడు రద్దు ప్రకటనకు అవకాశం
సాక్షి, చైన్నె: టంగ్‌స్టన్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ కేంద్రం గురువారం ప్రకటన చేసేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో అరిటాపట్టి వాసులతో కలిసి జరిగిన భేటీ అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. మదురై మేలూరు పరిసరాలలో టంగ్‌స్టన్ మైనింగ్ తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడం ఆ పరిసరాలలోని రైతులలో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం సైతం టంగ్‌స్టన్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఈ పరిస్థితుల్లో ఉద్యమ కమిటీలోని సుశీంద్రన్, ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్, రాజ సింహన్, బాల మురుగన్, మునియప్పన్‌తో కలిసి పలువురు రైతులు బుధవారం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో– ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలైతో కలిసి కేంద్ర గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డిని అరిటాపట్టి ఉద్యమ కమిటీ బృందం కలిసింది. తమ ప్రాంతంలో నెలకొన్న ఆందోళనలు, సాగుతున్న ఉద్యమాలు, టంగ్‌స్టన్ తవ్వకాలకు అనుమతి ఇచ్చిన గ్రామాలలో పరిస్థితులు, అక్కడి చరిత్ర, పురాతనత వంటి అంశాలను మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అనుమతులు రద్దు చేయాలని కోరారు. అనంతరం మీడియాతో అన్నామలై మాట్లాడుతూ మదురై వాసులకు తాము ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుందన్నారు. కేంద్రమంత్రి దృష్టికి అన్ని వివరాలను తీసుకెళ్లామని, తవ్వకాలకు ఇచ్చిన అనుమతుల రద్దు విషయంగా గురువారం మంచి ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment