డెల్టాలో కేంద్ర బృందం పరిశీలన
● నష్టం వివరాలు తెలియజేసిన రైతులు
సాక్షి, చైన్నె: అకాల వర్షం కారణంగా డెల్టాలోని నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, మైలాడుతురై జిల్లాలో సుమారు లక్ష ఎకరాలలో సంబా వరి పంట వర్షార్పణమైన విషయం తెలిసిందే. అలాగే, మరెన్నో వేల ఎకరాలలో ఉద్ది, పెసర పప్పు దినుసుల పంటలు దెబ్బ తిన్నాయి. తమను ఆదుకోవాలని అన్నదాత చేసుకున్న విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పంటనష్టంపై అంచనా వేసి, రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో తమిళనాడుకు పంట నష్టం అంచనా నిమిత్తం ఆహార భద్రతా విభాగం పరిధిలోని పరిశోధన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్లు నవీన్, టీఎం ప్రీతి, సాంకేతిక నిపుణులు రాహుల్, అభిషేక్ పాండేతో కూడిన కమిటీని కేంద్రం నియమించారు. ఈ కమిటీ బుధవారం తిరుచ్చికి చేరుకుంది. అక్కడి అధికారులతో భేటి అనంతరం నాగపట్నం, తిరువారూర్, తంజావూరు జిల్లాలలో పర్యటనకు సిద్ధమైంది. సాయంత్రం తంజావూరులోని వరి కొనుగోలు కేంద్రాలలో పరిస్థితిని ఈ బృందం పరిశీలించింది. తడిసిన వరి బస్తాలను, తడి మయంగా ఉన్న వరి పంటను పరిశీలించారు. గురువారం ఉదయం నుంచి పంట పొలాల వైపుగా ఈ బృందం పర్యటన జరగనుంది. ఉదయం తిరువారూర్ జిల్లాలో ఈ బృందం పర్యటిస్తుంది. మధ్యాహ్నం నాగపట్నంలో, 24వ తేదీన మైలాడుతురైలో పర్యటించనున్నది. రైతుల కన్నీటి వేదనను ఈ బృందాలకు వివరించే విధంగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. రైతులు సైతం అధికారులకు తమ గోడును వివరించేందుకు సిద్ధమయ్యారు. 25వ తేదీన ఈ బృందం చైన్నెకు రానున్నది. సీఎం స్టాలిన్‌ను కలిసి, రాష్ట్ర స్థాయి అధికారులతోసమావేశానందరం ఢిల్లీకి బయలు దేరనున్నది. కాగా, సమగ్ర పరిశీలన జరిపి రైతులను ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జికే వాసన్, డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్ విన్నవించారు. ఎకరానికి రూ.30 వేల నష్ట పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment