ఖమ్మం వైద్యవిభాగం: అతడు అంబులెన్స్ డ్రైవర్. రోగులను సమయానికి ఆస్పత్రులకు తరలించడం అతడి విధి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ నిండు గర్భిణి ప్రాణాలు కాపాడాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన జి.కల్యాణి నిండు గర్భవతి. కాన్పు కోసం జిల్లా ప్రభుత్వ పెద్దాస్పత్రిలో చేరింది. అయితే ఆమెకు ప్రసవం చేసే సమయంలో కరోనా టెస్టు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు ఆమెను వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. గురువారం ఉదయం పెద్దాస్పత్రికి చెందిన అంబులెన్స్‌లో గర్భిణీని వరంగల్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో తిరుమలాయపాలెం దాటిన తర్వాత ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అంబులెన్స్ డ్రైవర్ వెంకట్రావ్ వాహనాన్ని పక్కకు నిలిపాడు. గర్భిణికి నొప్పులు ఎక్కువై శిశువు బయటకు వస్తున్న సమయంలో వెంకట్రావ్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి బిడ్డను బయటకు తీశాడు. దీంతో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే డ్రైవర్ తల్లీ, బిడ్డను ఖమ్మంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రానికి తరలించాడు. తల్లీ, బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెకు ప్రత్యేకంగా కోవిడ్ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. సమయానికి అప్రమత్తమై బిడ్డను బయటకు తీసి ప్రసవం చేసిన డ్రైవర్ వెంకట్రావ్‌ను ఆస్పత్రి అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment