పలువురు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్‌లకు
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పిలుపు
అందులో మాజీ సీఎస్‌లు సోమేశ్‌కుమార్, ఎస్‌కే జోషీ, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శి స్మిత సబర్వాల్ కూడా..
రజత్‌కుమార్, కె.రామకృష్ణారావు, వి.నాగిరెడ్డి తదితర అధికారులకూ సమన్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లపై చేపట్టిన విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం బీఆర్‌కేఆర్ భవన్‌లోని తమ కార్యాలయంలో పలువురు సీనియర్ ఐఏఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్‌లను ప్రశ్నించనుంది.
సోమవారం విచారణకు రావాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి రిటైరైన సోమేశ్‌కుమార్, ఎస్‌కే జోషీ, ఆర్థిక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి, ఆ శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి రజత్‌కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పనిచేసిన స్మిత సబర్వాల్‌లకు సమన్లు జారీ చేసింది.
ఇప్పటివరకు నిర్మాణ, సాంకేతిక అంశాలపై వివరాలు సేకరించిన చేసిన కమిషన్.. ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలపై దృష్టిపెట్టిందని, ఈ క్రమంలోనే అనుమతుల జారీ, అంచనా వ్యయాల పెంపు, నిధుల విడుదలలో పాత్ర ఉన్న ఐఏఎస్‌లను విచారించనుందని అధికారవర్గాలు చెప్తున్నాయి.
నిర్మాణ సమయంలో ఉన్నవారిని..
తెలంగాణ ఏర్పాటయ్యాక సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్‌కే జోషి పనిచేశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనా నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్‌చార్జి బాధ్యతల్లో కొనసాగారు. ఆయన హయాంలోనే కాళేశ్వరంప్రాజెక్టుకు సంబంధించిన చాలా నిర్ణయాలు తీసుకున్న నేపత్యంలో.. కమిషన్ ఆయనను విచారణకు పిలిచింది.
ఎస్‌కే జోషి రిటైరైన తర్వాత కొన్ని నెలల పాటు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్‌చార్జి బాధ్యతల్లో సోమేశ్‌కుమార్ వ్యవహరించడంతో ఆయనను కూడా విచారణకు రావాలని ఆదేశించింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా స్మిత సబర్వాల్ దాదాపుగా తొమ్మిదిన్నరేళ్లపాటు పనిచేశారు. సీఎం కార్యదర్శి హోదాలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించిన నేపథ్యంలో.. ఆమెను కమిషన్ విచారించనుంది.
ప్రస్తుతం ఆమె రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాల సమీకరణ, బడ్జెట్ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులో పాత్ర నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ వి.నాగిరెడ్డి, ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కమిషన్ విచారణకు రమ్మని కోరింది.
నేడు కమిషన్‌కు కె.రఘు ప్రజెంటేషన్
ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌ల విచారణ సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. తర్వాత కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘు మధ్యాహ్నం 2.30 గంటలకు కమిషన్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలు, అవకతవకతలపై సాక్ష్యాధారాలను సేకరించడానికి ఆయనను కమిషన్ విచారణకు పిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment