
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం శాసనసభ్యుడిగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు బుధవారం అసెంబ్లీ కార్యదర్శితో పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చి న హైకోర్టు, ఆయనపై పోటీ చేసిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులను కలసి కోర్టు తీర్పు కాపీని అందజేశారు. సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో కూడా సమావేశమై కోర్టు తీర్పు కాపీతో పాటు తన విజ్ఞాపన అందజేశారు. కాగా, కోర్టు తీర్పును పరిశీలించి, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సమాచారం ఇస్తామని అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లు జలగం వెంకట్రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ అంశంపై తాను అసెంబ్లీ స్పీకర్‌తో ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు.
బీఆర్‌ఎస్ పార్టీ కోసమే పనిచేస్తా..
అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు వచ్చి న జలగం వెంకట్రావు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి తనను ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చి న విషయాన్ని ఆయన వివరించారు. తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తానన్నారు. గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం చేశానో ప్రజలకు తెలుసని, ఎన్నికల షెడ్యూలుకు మరో మూడు నెలల సమయం ఉన్నందున ప్రజలకు మరింత మేలు చేస్తానని వెంకట్రావు పేర్కొన్నారు.