సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో భేటీ అయింది. ఆనకట్ట కుంగిన వ్యవహారంపై ఇంజినీర్లతో కేంద్ర బృందం చర్చించింది. ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించింది.
భేటీ అనంతరం తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మాట్లాడుతూ.. ‘‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు. లోపాలు ఉంటే మూడు సీజన్లు తట్టుకునేది కాదు కదా!. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పియర్ కుంగింది. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఇసుక కారణంగా సమస్య వచ్చిందని భావిస్తున్నాం. బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ ఆఫ్ శాండ్, క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయి. కాపర్ డ్యామ్‌కు వరద తగ్గాక నవంబర్ చివరలో ఘటనపై సమగ్ర పరిశీలన చేస్తాం’’ అని ఈఎన్‌సీ పేర్కొన్నారు.
ఈ భేటీలో తెలంగాణ ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, ఓఎస్‌డీ శ్రీధర్ దేశపాండే, ఎల్ అండ్ టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
పెద్ద శబ్దంతో కుంగుబాటు..
కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ శనివారం రాత్రి భారీ శబ్దంతో కుంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం ఆందోళన రేకెత్తించింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. దీంతో బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశంయలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ఆపై కేంద్రం తరపున నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మేడిగడ్డ ఆనకట్ట, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఇంజనీర్ల ద్వారా వివరాలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment