సాక్షి, ఆదిలాబాద్: అడవులు, కొండలతో నిండిన ఆ నియోజకవర్గానికి పదేళ్ళుగా కోనేరు కోనప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పదేళ్ళుగా కోనప్ప చేసిందేమీ లేదని అక్కడి ప్రజలు నిట్టూరుస్తున్నారు. రోడ్లు, విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, ఉపాధి విషయాల్లో ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. కాని ఆ ఎమ్మెల్యే మాత్రం మూడో సారి నేనే గెలుస్తా అంటున్నారు. అయితే కోనప్పకు గట్టి ప్రత్యర్థి తగిలారు. అధికార పార్టీని ఓడిస్తానంటున్నారు? ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? అక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయి?
తెలంగాణ అసెంబ్లీలో ఆ నియోజకవర్గం క్రమ సంఖ్య ఒకటి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సిర్పూర్ టి. నియోజకవర్గంలో నిజాం కాలం నాడే కాగిత పరిశ్రమ స్థాపించారు. గతంలో మూత పడిన ఆ పరిశ్రమను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి తెరిపించారు. ఈ నియోజకవర్గం చుట్టూ పెన్‌గంగ, ప్రాణహిత, పెద్దవాగు వంటి జీవనదులు ప్రవహిస్తున్నాయి. సిర్పూర్ నుండి 2014 నుంచి కోనేరు కోనప్ప అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదట బహుజన్ సమాజ్ పార్టీ తరపున గెలిచిన కోనప్ప..మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గులాబీ గూటికి చేరారు. గత ఎన్నికల్లో కూడా కారు గుర్తు మీద విజయం సాధించారు. మూడోసారి కూడా బీఆర్ఎస్ టిక్కెట్ దక్కించుకుని బరిలోకి దిగారు. మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తా అంటున్నారు కోనేరు కోనప్ప.
దశాబ్ద కాలంగా ఎమ్మెల్యేగా..
కోనప్ప ఎమ్మెల్యే అయ్యాకే మూతపడ్డ కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తిరిగి తెరిపించారు. దీనవల్ల వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. కాగజ్‌నగర్ లోని సర్కారు అసుపత్రిని అభివ్రుద్ది చేశారు. వార్థా నది పై బ్యారేజి నిర్మించడానికి నిధులు వచ్చేలా కృషి చేశారు. మహరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య గూడెం వంతెన నిర్మించడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మెరుగుపడ్డాయి.
అయితే దశాబ్ద కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నా కోనప్ప చేసిన అభివృద్ధి ఏమీలేదనే అపవాదు ఉంది. పేపర్ పరిశ్రమను తిరిగి ప్రారంభించినా దానివల్ల స్థానికులకు ఏమీ ఉపాధి కలగలేదని, ఇతర రాష్ట్రాల వాళ్ళకే అందులో ఉద్యోగాలు లభించాయని సిర్పూర్ లోని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ప్రజలకు తాగునీరు తీవ్ర సమస్యగా మారింది. మారుమూల ప్రాంతాల ప్రజలు అసుపత్రికి వెళ్లాలంటే రోడ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆదివాసీ మహిళలు, తల్లులు పుట్టెడు అవస్థలు పడుతున్నారు.
ఇంతకాలంగా ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్నప్పటికీ కోనప్ప నియోజకవర్గానికి ఆయన చేసిన మేలు ఏమీ లేదని మండిపడుతున్నారు అక్కడి ప్రజలు. ఎమ్మెల్యే పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. రైతులకు సాగునీటి కోసం వార్థా బ్యారేజ్ నిర్మిస్తామనే హామీ మాటలకే పరిమితమైంది. నియోజకవర్గం చుట్టూ నీరున్నా పంటపొలాలకు సాగునీరు అందే పరిస్థితి లేదు. ఈ సమస్యలన్నీ ప్రతికూలంగా మారతాయని అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆందోళన చెందుతున్నారు.
సిర్పూర్‌లో కోనప్ప పాలనను అంతం చేస్తామంటూ..
ఒకవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత.. మరోవైపు కోనప్పపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో.. వీటన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సిర్పూర్ జనరల్ కేటగిరీ సీటు. ప్రవీణ్‌కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీఎస్‌పీకి వచ్చిన ఓట్లు, పార్టీ పట్ల ఉన్న ఆదరణ దృష్ట్యా సిర్పూర్‌లోనే తలపడాలని ప్రవీణ్‌కుమార్ నిర్ణయించుకున్నారు.
గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా మంచిపేరు తెచ్చుకున్న ప్రవీణ్‌కుమార్ పట్ల ఎస్సీ వర్గాల్లో ఆదరణ బాగా వ్యక్తమవుతోంది. ఎస్‌టీలు, బౌద్ధ మతాన్ని ఆచరించేవారు కూడా బీఎస్‌పీ పట్ల మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనమీద స్థానికేతరుడనే ముద్ర వేయడాన్ని ప్రవీణ్‌కుమార్ ఖండించారు. నియోజకవర్గంలోనే ఇల్లు కొనుక్కుని స్థానికంగానే ఉంటున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ తన సంస్థ స్వేరో కార్యకర్తలను మోహరిస్తున్నారు. సిర్పూర్‌లో కోనప్ప పాలనను అంతం చేస్తామంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఎస్‌పీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్.
ఎన్నికల బరిలో పాల్వాయి హరీష్ బాబు..
అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ తో పాటు బిజెపి అభ్యర్థిగా పాల్వాయి హరీష్ బాబు ఎన్నికల బరిలో దిగుతున్నారు. హరీష్ బాబు తల్లితండ్రులిద్దరూ సిర్పూర్ నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. మొత్తంగా పాల్వాయి కుటుంబానికి ఇక్కడి ప్రజల్లో మంచి పేరుంది.
ఒకప్పుడు వీరిది కాంగ్రెస్ కుటుంబమే అయినా.. గత ఎన్నికల్లో హరీష్‌బాబు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కాని మంచి ఓట్లే సాధించారు. ఈసారి బీజేపీ తరపున తలపడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా హిందూ ఓట్ బ్యాంక్ తనకు మద్దతుగా ఉంటుందని, పైగా సర్కార్ మీద, స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత తనకు అనుకూలమైతే గెలుపు ఖాయమని హరీష్ భావిస్తున్నారు. మొత్తం మీద మూడు పార్టీల అభ్యర్థులు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment