సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, వేదికపైన సీపీ కార్తికేయ, కామారెడ్డి కలెక్టర్ శరత్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ పోలింగ్ అధికారులను నియమించామన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు రాజకీయ పార్టీలు ప్రచారం చేయడానికి వీలు లేదన్నారు. లిక్కర్ దుకాణాలు మూసివేయాలని, సోషల్ మీడియాపై బాగా నిఘా పెట్టాలన్నారు.
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను కార్యాచరణ ప్రణాళికతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో కామారెడ్డి కలెక్టర్ శరత్‌తో కలిసి ఉమ్మడి జిల్లా అధికారులతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈనెల 9న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ సామగ్రిని రెండు జిల్లాలకు 8న నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి పంపిణీ చేస్తామన్నారు. మొత్తం ఓటర్లు 824 మంది ఉన్నారని తెలిపారు. గతంలో రెవెన్యూ డివిజన్‌కు ఒక పోలింగ్ స్టేషన్ ఉండేదని, ప్రస్తుతం ప్రతి మండలానికి ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం 50 పోలింగ్ స్టేషన్‌లలో ఓటింగ్ జరుగుతుందన్నారు. నిజామాబాద్‌లో 28, కామారెడ్డిలో 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటరు జాబితాను పోలింగ్ స్టేషన్‌ల వారీగా డివైడ్ చేసి మండల అధికారులు, ఆర్డీవోలకు, రాజకీయ పార్టీలకు, పోటీలో ఉన్న అభ్యర్థులకు అందజేశామన్నారు. 50 పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ కోసం 15 రూట్లు ఏర్పాటు చేశామన్నారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి సిరిసిల్ల జిల్లాలో రెండు ఎంపీటీసీ ఓట్లు, సంగారెడ్డిలో ఒక ఎంపీటీసీ ఓటు ఉన్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ పోలింగ్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికల పరిశీలనకు 21 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు వివరించారు. 48 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సిస్టం ఏర్పాటు చేస్తుండగా, మిగతా రెండు కేంద్రాల్లో వీడియో కెమెరా ద్వారా రికార్డు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి, మైక్రో పరిశీలకులతో పాటు ఒక మెడికల్ అధికారి, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లను ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు రాజకీయ పార్టీలు ప్రచారం చేయడానికి వీలు లేదన్నారు. పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. పోలింగ్‌కు ముందు 48 గంటలను డ్రై డేగా పాటించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 7న సాయంత్రం 5 గంటల నుంచి లిక్కర్ దుకాణాలు మూసివేయాలన్నారు.
చివరి 48 గంటల ముందు సోషల్ మీడియాపై బాగా నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. 8వ తేదీన పోలింగ్ సామగ్రి పంపిణీ, 12న కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నందున ఈ రోజుల్లో పాలిటెక్నిక్ కళాశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ ఉన్న 100 మీటర్ల పరిధిలో కార్యాలయాలకు, దుకాణాలకు సెలవు ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్, కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటు వినియోగించుకునే వారిలో 24 మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తెలిపారు. వారికి రెండు విధాలుగా ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఒకటి పోస్టల్ బ్యాలెట్, రెండోది చివరి గంటలో నేరుగా కేంద్రానికి వచ్చి ఓటు వేయవచ్చని తెలిపారు. ఇందుకు కోసం ప్రతి పోలింగ్ కేంద్రానికి నాలుగు పీపీఈ కిట్లు ఇస్తున్నామని, హెల్ప్ డెస్క్ దగ్గర మెడికల్ అధికారి ఉంటారని తెలిపారు.
అలాగే పోలింగ్ ఏజెంటు ఎప్పుడు వచ్చినా పోలింగ్ కేంద్రంలోని అనుమతించాలని, పోటీలో ఉన్న అభ్యర్థికి ఒక ఏజెంటు మాత్రమే ఉండాలన్నారు. ప్రభుత్వ అధికారులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏజెంట్‌గా ఉండరాదన్నారు. ఓటు వేసేవారందరూ తప్పకుండా మాస్కు, గ్లౌజులు ధరించాలని, సానిటైజర్ వినియోగించాలని సూచించారు. ఓటు ఓటువేసే వ్యక్తిని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు గుర్తిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేత, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఉమ్మడి జిల్లా ఆర్డీవోలు, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment