సాక్షి, హైదరాబాద్ : బోధనలేక బడి బోసిపోయింది. తరగతి గది చిన్నబోయింది.. బ్లాక్‌బోర్డు తెల్లబోయింది.. ఆవరణను నిశ్శబ్దం ఆవరించింది.. పాఠాలులేవు.. ఆటపాటలు అసలేలేవు.. కరోనా సృష్టించిన కల్లోలం జాడలు ఇంకా వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యాబోధనపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఆన్‌లైన్, డిజిటల్ (టీవీ పాఠాలు, వీడియో పాఠాలు) విద్యాబోధనను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించినా అది పూర్తిస్థాయి ప్రత్యక్ష విద్యాబోధనతో సమానం కాదన్న విషయాన్ని అధికారులే అంగీకరిస్తున్నారు.
విద్యార్థులను ఖాళీగా ఉంచకూడదనే ఉద్దేశంతో చేపట్టిన ప్రత్యామ్నాయ విధానమే తప్ప దాని ద్వారా పెద్దగా ఫలితాలను సాధించలేమని పేర్కొంటున్నారు. ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభిస్తే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదివే 30 లక్షలమంది, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 31 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తారు కనుక కరోనాను అధిగమించి ఎలా ముం దుకు సాగాలన్న దానిపైనే వివిధ కోణాల్లో ఆలోచనలు చేస్తున్నారు. దీనిపై ఇటీవల గురుకులాల సొసైటీ, విద్యాశాఖ అధికారులతోనూ చర్చించారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులపైనా చర్చించారు. అయితే అందులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీఎంతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
సీఎం అంగీకరిస్తే దశలవారీగానే..
రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభానికి సీఎం ఒప్పుకున్నా, దశలవారీగానే నిర్వహించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. తాజా భేటీలోనూ మొదట 9, 10 తరగతుల్లోనే బోధన చేపట్టే అంశంపై చర్చించారు. వీలైతే వచ్చే నెలలో 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించి దశలవారీగా అన్ని తరగతులకు విస్తరిస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించారు. కరోనా ప్రభావం తగ్గి, పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే నెలలో తరగతులను ప్రారంభించేలా నిర్ణయం తీసుకునే విషయాన్ని సీఎంకు విన్నవించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. లేదంటే జనవరిలో కచ్చితంగా ప్రారంభించేలా కార్యాచరణను సిద్ధం చేసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
రవాణా సదుపాయం, హాస్టళ్ల నిర్వహణా ప్రధానమే..
ఒకసారి పాఠశాలల ప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆయా విద్యార్థుల రవాణా సదుపాయం, ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లు, గురుకులాల ప్రారంభంపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని దాదాపు 30 లక్షలమంది విద్యార్థుల్లో 8 లక్షల మందికిపైగా విద్యార్థులు గురుకులాల్లోనే ఉన్నారు. మరోవైపు సంక్షేమ హాస్టళ్లలోనూ విద్యార్థులు ఉన్నారు. వీటికితోడు ప్రైవేటు స్కూళ్లకు చెందిన హాస్టళ్లలో కూడా విద్యార్థులు ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలన్నింటిపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
నాలుగు నెలలు నిర్వహిస్తేనే పరీక్షలు..
విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలంటే కనీసంగా నాలుగు నెలల పాటు(120 రోజులు) ప్రత్యక్ష విద్యాబోధన అవసరమని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందుకు వచ్చే నెలలోగానీ, జనవరిలోగానీ కచ్చితంగా బోధనను ప్రారంభించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కరోనా ప్రభావం కనుక తగ్గకపోతే ప్రస్తుతం ప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్ ప్రకారం అమలు చేస్తున్న యాక్టివిటీ/ప్రాజెక్టు బేస్డ్ విద్యాబోధనను కొనసాగించాల్సి వస్తుందని, వాటి ఆధారంగానే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
గతేడాది నాలుగు ఫార్మేటివ్ అసెస్‌మెంట్, ఒక సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్ష జరిగినందున విద్యార్థులను పైతరగతులకు ప్రభుత్వం ప్రమోట్ చేసిందని, ఇప్పుడు అది సాధ్యం కాదని పేర్కొంటున్నారు. అయితే విద్యార్థులకు వార్షిక పరీక్షలు కచ్చితంగా ఉంటాయని చెబుతున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంటున్నారు.
మెజారిటీ రాష్ట్రాల్లో తీసుకోని నిర్ణయం..
ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో ప్రత్యక్ష విద్యాబోధన ఎలా కొనసాగుతోందన్న దానిపై విద్యాశాఖ ఓ నివేదికను రూపొందించింది. ఆ నివేదికపైనా ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు చర్చించారు. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో పాఠశాలల ప్రారంభానికి నిర్ణయం తీసుకోగా, అందులో కొన్ని ఇçప్పటికే స్కూళ్లను ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించింది. అయితే మెజారిటీ రాష్ట్రాల్లో పాఠశాలల ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కర్ణాటకలో పాఠశాలలను ప్రారంభించినా మళ్లీ మూసివేశారు.
పాఠశాలలు ప్రారంభించని ప్రధాన రాష్ట్రాలు..
కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, కేరళ, ఢిల్లీ, మేఘాలయ, హర్యానా, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, జార్ఖండ్, లడఖ్ రాష్ట్రాల్లో పాఠశాలల ప్రారంభంపై ఇంతవరకు అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడులో ఈనెల 16 నుంచి ప్రారంభించాలని భావించారు. ఒడిషాలోనూ ఈ నెల 16వ తేదీ నుంచి పై తరగతులకు (9 నుంచి 12వ తరగతి వరకు) విద్యా బోధన ప్రారంభించాలని అనుకున్నారు.
ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించిన రాష్ట్రాలు..
ఆంధ్రప్రదేశ్, అస్సాం, సిక్కిం, మిజోరాం, త్రిపుర, బిహార్ రాష్ట్రాలు ప్రత్యక్ష విద్యాబోధనను ప్రారంభించాయి. ఉత్తరప్రదేశ్‌లో అక్టోబర్ 19వ తేదీన 9, 10 తరగతులకు ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పాండిచ్చేరిలో నవంబర్ 2వ తేదీ నుంచి 10 నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన ప్రారంభించారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకే: దేవసేన, పాఠశాల విద్యా కమిషనర్
పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు ముందుకు సాగుతాం. ప్రత్యక్ష బోధన ప్రారంభానికి ప్రభుత్వం ఓకే అంటే అమలు చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే, కరోనా పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు ప్రత్యామ్నాయ విద్యావిధానాన్ని (యాక్టివిటీ/ప్రాజెక్టు బేస్డ్) కొనసాగిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment