సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్ వాహనాలకు తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తు అంతా విద్యుత్ వాహనాలేదని, రానున్న రోజుల్లో మెట్రోస్టేషన్లు, పట్టణాల మధ్య ప్రయాణికులను చేరవేసేందుకు, కార్గో అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాలే వినియోగించాల్సి ఉంటుందన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని తమ ప్లాంట్ విస్తరణలో భాగంగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న విద్యుత్ వాహనాల తయారీ ప్లాంట్‌కు సోమవారం ఆయన భూమిపూజ చేశారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఈవీ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు, కాలుష్యరహిత వాహనాలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగానే 2020లో విద్యత్ వాహనాల పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. విద్యుత్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఆర్టీసీ వంటి సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నాయని, ప్రైవేటు వ్యక్తులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ఈవీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. జహీరాబాద్‌లో మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌ను, వికారాబాద్ జిల్లా ఎన్కతలలో ఇన్నోవేషన్ జోన్‌ను, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ జోన్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ–రేస్ సందర్భంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రకటించామని, ఎలక్ట్రిక్ సమ్మిట్‌లో పలు ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
టీఎస్–ఐపాస్ ద్వారా 23 వేల పరిశ్రమలు
ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు, పరిశ్రమలు రావాలన్నా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా రాజకీయ స్థిరత్వం, శాంతిభద్రతలు, సుస్థిర ప్రభుత్వ విధానాలు ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న టీఎస్–ఐపాస్‌తో రాష్ట్రంలో 23 వేలకుపైగా పరిశ్రమలు, రూ. 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయన్నారు. ఈ పరిశ్రమల వల్ల సుమారు 20 లక్షల మందికి ఉపాధి లభించిందని... పరిశ్రమలు 3 షిఫ్టుల్లో ఉత్ప త్తిని కొనసాగించేలా ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సౌక ర్యాన్ని కల్పిస్తోందని వివరించారు. యాజమాన్యా లు, కార్మిక సంఘాలు, ప్రభుత్వం మధ్య సత్సంబంధాలుంటే పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు. అవినీతిరహిత, పారదర్శక విధానాల అమలుతోపాటు కార్మికుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతోందని చెప్పారు.
స్థానికులకే ఉద్యోగ అవకాశాలు..
పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ తపన అని కేటీఆర్ అన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు ఉద్యో గావకాశాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యువత నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చు కో వాలని పిలుపునిచ్చారు. మహీంద్ర కంపెనీలో తయారయ్యే వాహనాలు హైదరాబాద్‌తోపాటు దేశంలోని అన్ని రోడ్లపై సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, మహీంద్ర లాస్ట్‌మైల్ మొబిలిటీ సీఈఓ సుమన్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment