ఆర్టీసీ విలీనం బిల్లు ఏమైంది? | What happened to the RTC merger bill | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ విలీనం బిల్లు ఏమైంది?

Published Fri, Sep 8 2023 3:48 AM | Last Updated on Fri, Sep 8 2023 3:48 AM

What happened to the RTC merger bill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:     ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశం మరోసారి గందరగోళంగా మారుతోంది. ఆగమేఘాల మీద శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏమైందో స్పష్టత లేకపోవటం కార్మికుల్లో ఆందోళనకు, అయోమయానికి కారణమవుతోంది. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపడంలో జాప్యం జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులు ఏకంగా రెండు గంటలపాటు బస్సులు దిగ్బంధం చేసి రాజ్‌భవన్‌ను ముట్టడించారు.

ఆ సమయంలో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్‌ మరుసటి రోజు హైదరాబాద్‌ వచ్చిమరీ ఆమోదం తెలిపారు. అంత వేగంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఇక బిల్లు ఆమోదం, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనానికి వీలుగా కమిటీ ఏర్పాటు కావటం, మార్గదర్శకాలు రూపొందటం, విలీన ప్రక్రియ పూర్తి కావటం కూడా అంతే వేగంగా జరుగుతుందని భావించారు. కానీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి సరిగ్గా నెల గడిచింది.

గత నెల ఆరో తేదీన శాసనసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అది గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు చేరింది. అయితే కొన్ని సందేహాల నివృత్తి కోసం దానిని న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్టు తర్వాత గవర్నర్‌ ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది.  

183 మంది ఉద్యోగులకుటుంబాలకు నిరాశ 
గత నెలలో పదవీ విరమణ పొందిన 183 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు నెలాఖరు వరకు ఉత్కంఠగా ఎదురుచూసి నిరాశ చెందాల్సి వచ్చింది. ఇప్పుడు మరో 200 కుటుంబాలు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. న్యాయశాఖ కార్య దర్శి కార్యాలయానికి వచ్చిన బిల్లు అప్పటినుంచి తెలంగాణ సచివాలయంలోనే ఉండిపోయిందంటూ కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై రాజ్‌భవన్‌ వర్గా లను ‘సాక్షి’వివరణ కోరగా, ఆర్టీసీ బిల్లు ఇంకా రాజ్‌భవన్‌కు చేరుకోలేదని పేర్కొన్నాయి. వేరే 3 బిల్లులు మాత్రం వచ్చాయని వివరించాయి.

ఆ రెండు వేతన సవరణలు చేయాలి: కార్మిక సంఘాలు 
బిల్లును తిరిగి రాజ్‌భవన్‌కు పంపటంలో జాప్యం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు, ఇప్పుడు మరో అంశంపై పట్టుపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 2017, 2021 వేతన సవరణలు పెండింగులో ఉన్నందున, వాటిని క్లియర్‌ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంటున్నాయి.

విలీన ప్రక్రియ లోపే ఆ రెండు వేతన సవరణలు చేస్తే, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను కొంత ఉన్నత స్థాయిలో స్థిరీకరించేందుకు వీలుంటుందని, లేకుంటే తక్కువ వేతన స్థాయిలోనే ఫిక్స్‌ అవుతాయని, ఇది కార్మికులను తీవ్రంగా నష్టపరుస్తుందని వివరిస్తున్నాయి. ఆయా అంశాలపై మరోసారి ఆందోళనకు సిద్ధమని అంటున్నాయి. 

ఇప్పుడు ఏ కార్యాలయాన్నిముట్టడించాలి 
అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ ఆమోదం తెలియజేయడంలో జాప్యం జరిగిందంటూ రాజ్‌భవన్‌ను ముట్టడించేలా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వమే జాప్యం చేస్తోంది. ఇప్పుడు ఏ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించాలి. బిల్లును ఇప్పటికీ రాజ్‌భవవన్‌కు పంపకుంటే వెంటనే పంపాలి. ఈలోపు కార్మికులకు బకాయి ఉన్న వేతన సవరణలు చేయాలి.  – అశ్వత్థామరెడ్డి, ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ 

వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి 
ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్‌ సంతకం కోసం వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి. జాప్యం చేయకుండా రెండు వేతన సవరణలు జరిపి, సీసీఎస్‌ బకాయిలు చెల్లించి, ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేయాలి.  – రాజిరెడ్డి, ఎంప్లాయీస్‌ యూనియన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement