సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. కేసులో కీలకంగా భావిస్తున్న వివేకా రాసిన లేఖపై ఇవాళ వివేకా కూతురు సునీతారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది.
వివేకా కేసులో సునీతారెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి సునీతను పిలిపించుకుని లేఖపై ఆరా తీశారు సీబీఐ అధికారులు. ఆమె కూడా భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఆమెను పిలిపించుకుని స్టేట్‌మెంట్ నమోదు చేసింది సీబీఐ. మరోవైపు వివేకా కేసులో పలువురు సాక్షులను సైతం సీబీఐ ప్రశ్నిస్తోంది.
రక్తపు మరకల లేఖ.. ఎందుకు గోప్యంగా ఉంచారు?
వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకుగాను పక్కా కుట్ర ఒకటి జరిగినట్టు ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి దీని వెనక ఉన్నట్టు కొన్ని ఆధారాలు బయటపెట్టారు.
వైఎస్ వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించినట్టు తేలింది. హంతకులు బెదిరించడంతో.. డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేకా రాశారు.
ఆ లేఖను మొదటగా అంటే ఆ రోజు ఉదయం 6.10లోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి.. ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసినవారెవరికైనా.. వివేకాది హత్యేనని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే.. తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పినట్టు కృష్ణారెడ్డి వెల్లడించారు, అదే విషయాన్ని దర్యాప్తులోనూ చెప్పారు.
ఆ తరవాతే నర్రెడ్డి మరో అడుగు ముందుకేసి శివ ప్రకాశ్ రెడ్డి ద్వారా అవినాష్‌రెడ్డికి చెప్పించారు. అవినాష్ కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాశ్ అక్కడకు చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు. అసలు లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు.
వాస్తవానికి వారు గనక ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేకా హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు.
ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆ లేఖతోపాటు వివేకా సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ.. వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నదే ఈ హత్య కేసులో కీలకం కానుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎంపీ అవినాష్‌రెడ్డి సిబీఐ దృష్టికి తీసుకెళ్లారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment