తిరుపతి అసెంబ్లీ, ఎంపీ సీట్లు స్థానికేతరులకే స్థానికుల ఆశలపై నీళ్లు
ఓటమి భయంతో చంద్రబాబు పొత్తులు
ఐదేళ్లుగా కష్టపడ్డా ఫలితం లేదని టీడీపీ నేతల నిట్టూర్పు
పార్టీ జెండా మోసినా గుర్తింపు ఇవ్వలేదని కన్నీళ్లు
లోలోపలే రగిలిపోతున్న ఆశావహులు
‘పార్టీలనే నమ్ముకున్నాము. ఈ ఐదేళ్లలో సొంత డబ్బులు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశాము. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాలు మోశాము. ప్చ్..! ఏం లాభం. అధినేతలెవ్వరూ గుర్తించలేదు. మావిన్నపాలు ఆలకించ లేదు. కాళ్లుమొక్కినా.. ఆత్మాభిమానం తాకట్టుపెట్టినా..కనికరించలేదు. స్థానిక నేతలందర్నీ పక్కన పెట్టేశారు. కరివేపాకులా వాడుకుని వదిలేశారు. స్థానికేతరులకు టిక్కెట్లు ఇచ్చి మమ్మల్ని తీవ్రంగా అవమానించారు. ఇప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్లాలి. ఇన్నాళ్లూ మేమే అభ్యర్థులమని ప్రజలను ఒప్పించి.. ఇప్పుడు పొత్తులో భాగంగా వేరొకరికి ఓట్లు వేయండని ఎలా అడగాలి..? అంటూ తిరుపతిలోని కూటమి నేతలందరూ కుమిలిపోతున్నారు. కొందరు లోలోపలే రగిలిపోతుండగా.. మరికొందరు బాధనుదిగమింగుకోలేక బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంకొందరు మౌన వ్రతం పాటిస్తూ.. అధికార పార్టీకి జై కొట్టేందుకు సిద్ధమైపోయారు.
సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తిరుపతి నగరానికి చెందిన టీడీపీ నేతలు ఆశగా ఎదురుచూశారు. అయితే ఓటమి భయంతో చంద్రబాబు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని టీడీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లారు. తిరుపతి పార్లమెంట్ బీజేపీకి, అసెంబ్లీ జనసేనకు కట్టబెట్టి టీడీపీ ఆశావహులకు కన్నీళ్లు మిగిల్చారు. ఐదేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు చేసిన ఖర్చులు, కేటాయించిన సమయం అంతా వృథా అవ్వడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.
ఆశల కురుక్షేత్రం!
ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతి మహానగరం దేశంలోనే ప్రసిద్ధి గాంచింది. ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి ఒక్క సారైనా ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని ప్రతి రాజకీయ నాయకుడు కోరుకుంటాడు. అలా కోరుకున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్‌తో పాటు కోడూరు బాలసుబ్రమణ్యం, జేబీ శ్రీనివాసులు, ఊకా విజయకుమార్, మబ్బు దేవనారాయణరెడ్డి, మీడియా కో–ఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ ఉన్నారు. వీరంతా అధిష్టానం ఆదేశాల మేరకు సొంత డబ్బు ఖర్చుచేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇదంతా చేయడానికి ప్రధాన కారణం ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తారనే ఆశ.
అభద్రతా భావం..పోత్తుకు శ్రీకారం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పరుగులు పెట్టించారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఆలయాల పాలక మండళ్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు.. ఇలా రాజ్యాంగ బద్ధమైన పదవులన్నింటినీ భర్తీచేసి వైఎస్సార్‌సీపీ కోసం పనిచేసిన వారందరికీ న్యాయం చేశారు. ఆ పదవుల నియామకాల్లోనూ సామాజిక న్యాయాన్ని పాటించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల్లోని అన్ని ఉప కులాల వారికి పదవులు కట్టబెట్టి శభాష్ అనిపించుకున్నారు.
ఇంకా.. మహిళలకు కూడా రాజ్యాంగ పదవుల్లో అధిక శాతం మందికి పదవులు ఇచ్చి మన్ననలు పొందారు. చంద్రబాబు చేయలేని పనులన్నింటినీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక చేసి చూపించారు. ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల జనం మరింత ఆకర్షితులయ్యారు. ఈ సారి ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు పొత్తుల కోసం ఆరాటపడ్డారు. ఇందులో భాగంగానే తిరుపతి జిల్లాలో కీలకమైన తిరుపతి పార్లమెంట్, అసెంబ్లీని వదులుకున్నారు. ఇది ఎన్నికల ముందే టీడీపీ ఓటమిని ఒప్పుకున్నట్లేనని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
తిరుపతిలో టీడీపీ జెండా కనుమరుగే!
చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో తిరుపతి నగరంలో టీడీపీ పూర్తిగా కనుమరుగు కానుంది. ఆత్మ విశ్వాసం, పార్టీ కేడర్‌పై నమ్మకం లేని నాయకుని వెంట నడవడంకంటే.. ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి, ఆ నాయకుడి అడుగులో అడుగువేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ మారడానికి ఇష్టం లేని నాయకులంతా ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చేతకాని దద్దమ్మల్ని చేశారు
పొత్తులో భాగంగా చంద్రబాబు తిరుపతి పార్లమెంట్, అసెంబ్లీని వదులుకుని స్థానిక టీడీపీ నేతలందరినీ దద్దమ్మల్ని చేశారని ఆశావహులు మండిపడుతున్నారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి పనబాకలక్ష్మి ఒకరు. టీడీపీకి అభ్యర్థి ఎవ్వరూ లేని సమయాల్లో పనబాక లక్ష్మి ముందుకు వచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ వచ్చారు. అటువంటి ఆమెకు చంద్రబాబు హ్యాండిచ్చారు. టీడీపీలోనే అనుకుంటే.. బీజేపీ, జనసేన అధినేతలు కూడా స్థానికేతరులనే అభ్యర్థులుగా ప్రకటించి స్థానిక నేతలను అవమానించారు. జనసేన విషయానికి వస్తే తిరుపతిలో పసుపులేటి హరిప్రసాద్, కిరణ్‌రాయల్‌తో పాటు మరికొందరు పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేశారు. బీజేపీలోనూ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారందరనీ కాదని స్థానికేతరుడైన వరప్రసాద్‌ని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కమలనాథులు రగిలిపోతున్నారు.
సుగుణమ్మ కన్నీళ్లు
కూటమి అభ్యరి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థి త్వంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కలత చెందారు. సోమవారం ఆమె తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ధర్మమా.. న్యాయమా అంటూ ఆవేదనకు లోనయ్యారు. చంద్రబాబు మరోసారి పునరాలోచించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment