టీడీపీ, జనసేన ఆశావాహులు అమరావతిలో తిష్ట
తిరుపతి టీడీపీ నేతలకుతీవ్ర అవమానం
అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు
తిరుపతి, నగరి టికెట్ కోసం బీజేపీ పట్టు
శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న మూడు ముక్కలాట
ఎన్నికలు సమీపిస్తున్నా బీజేపీ, టీడీపీ, జనసేనలో అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమతోంది. అధినాయకులు అమరావతిలో తిష్టవేసి అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందోనని లెక్కలు వేసుకుంటున్నారు. అభ్యర్థుల ప్రకటనపై తుది కసరత్తు జరుగుతోందని తెలుసుకున్న తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, నగరి ఆశావాహులు అమరావతికి పరుగులు పెడుతున్నారు. నోటా ఓట్లతో పోటీపడే నాయకులు సైతం ‘నాదే టికెట్.. నా పేరు ఖరారు చేశారు’అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అది చాలదన్నట్టు బాణసంచా పేల్చుతూ సంబరాల్లో మునిగిపోతున్నారు. మరోవైపు ఇంకో వర్గం నాయకుల అనుచరులు ‘లేదు లేదు.. మా నాయకుడి పేరు ఖరారైందంట’ అంటూ పోటీపడి టపాకాయలు పేల్చుతున్నారు. దీంతో ఎవరికి టికెట్ వస్తుందో.. ఎవరికి రాదో తెలియక ఆయా పార్టీల శ్రేణులు గందరగోళంలో మునిగిపోతున్నారు.
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లేందుకు అనైతిక పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తు పెట్టుకున్నాక ఆశావహుల అభ్యర్థుల జాతకాలు మారే ప్రమాదంలో పడ్డాయి. తిరుపతి టికెట్టు జనసేనకు కేటాయించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజుల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక.. కమలనాథులు తిరుపతి అసెంబ్లీ కావాలని పట్టుబడుతున్నారు. నోటా ఓట్లతో పోటీపడే నాయకుడు ఒకరు టికెట్ తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకన్న చిల్లర వేషాల నాయకుడు ఒకరు.. ‘అదెలా కుదురుతుంది.. టికెట్ మాదే’ నంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కండవాలు మార్చుకునేందుకు సిద్ధం
తిరుపతి జనసేనకే అని తేలిపోవడంతో.. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఊకా విజయకుమార్, జేబీ శ్రీనివాసులు మరో ఇద్దరు నాయకులు కండువా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా వీరు అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తిరుపతి టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ తీర్మానం చేసి పంపిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అమరావతిలో చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న చంద్రబాబు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదని విశ్వసనీయ సమాచారం. దీంతో టీడీపీలో ఉండి ప్రయోజనం లేదని జనసేనలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రెండు రోజులుగా అమరావతిలో తిష్టవేసినట్లు ఆమె వర్గీయులు చర్చించుకుంటున్నారు.
మరో వైపు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు మనుమరాలు, మరొకరు జనసేన తరుఫున టికెట్ తమకే ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. నగరి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించి కాషాయం కండువా కప్పుకున్న అశోక్ రాజు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. నగరి టీడీపీ అభ్యర్థిగా ఇదివరకే గాలి భానుప్రకాష్ పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత బీజేపీతో పొత్తు కుదరడంతో అశోక్‌రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. టికెట్ ఇస్తే పార్టీలో ఉంటాను.. లేదంటే పార్టీ నుంచి వైదొలుగుతానని బీజేపీ పెద్దలకు తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
శ్రీకాళహస్తిలో మూడు ముక్కలాటే..
మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఆశావాహులు శ్రీకాళహస్తి టికెట్ తనకే కావాలంటూ ఓ వైపు బొజ్జల సుధీర్‌రెడ్డి, మరో వైపు కోలా ఆనంద్, ఇంకో వైపు వినూత ఆయా పార్టీ అధినాయకుల వద్ద డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థి తానేనని ఎవరికి వారు ప్రకటించుకోవడంతో శ్రీకాళహస్తిలో ఆ పార్టీ శ్రేణులు బాణసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ ముగ్గురూ కొట్లాడుకుంటుంటే.. మరో వైపు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తమ సామాజికవర్గం వారిని వెంటబెట్టుకుని శ్రీకాళహస్తి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మూడు పార్టీలకు చెందిన ఆశావాహులు ఎవరికి వారు తానే అభ్యర్థి అని అనుచరుల వద్ద చెబుతుండడంతో వారు కూడా తమ నాయకుడికే టికెట్ ఖరారైందని అత్యుత్సాహంతో ప్రచారం చేసుకుంటున్నారు. గత మూడు రోజులుగా ఎవరికి వారు టికెట్ తనకేనని ప్రకటించుకుంటూ బాణసంచా పేల్చుకుంటుండడంతో ఆయా పార్టీ శ్రేణులు గందరగోళంలో పడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment