తెలుగు తమ్ముళ్లకు అడుగడుగునా అవమానాలే
మాజీ ఎమ్మెల్యేలను పలకరించని బాబు
రిషితారెడ్డి అనుమతి ఉంటేనే వేదికపైకి
శ్రీకాళహస్తి సీనియర్ నేతలను అడ్డుకున్న వైనం
బాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఆదిమూలం
సాక్షి, తిరుపతి/శ్రీకాళహస్తి: చంద్రబాబు చేపట్టన ప్రజాగళంలో తెలుగు తమ్ముళ్లకు అడుగడుగునా అవమానాలు తప్పలేదు. శ్రీకాళహస్తి సభలో మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్యను చంద్రబాబు మాట వరసకై నా పలకరించలేదు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోవడం కనిపించింది. చంద్రబాబు వస్తున్నారని తెలిసి నియోజకవర్గం నుంచి తరలివచ్చిన సీనియర్ నాయకులందరి పేర్లు సెక్యురిటీకి ఇవ్వకపోవడంతో ఎవ్వరినీ వాహనంపైకి ఎక్కించలేదు. దీంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేతలు తాటిపర్తి ఈశ్వర్‌రెడ్డి, కామేష్‌యాదవ్, గాలి మురళీనాయుడు, పొన్నారావు, బాలాజీ నాయుడు, జగన్నాథం నాయుడుతో పాటు పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులను తీవ్రంగా అవమానించి పంపేశారు.
అదేవిధంగా సత్రవాడ ప్రవీణ్, ఎస్సీవీ దిలీప్ మరికొందరిని రిషితారెడ్డి అనుమతిస్తేగానీ వేదికపైకి ఎక్కనివ్వలేదు. చెంచమనాయుడు ఈ అవమానాన్ని భరించలేక పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. ఇదిలా ఉంటే.. ఏర్పేడు ఇసుక మాఫియాకు 16 మంది బలైన ఘటనలో ప్రధాన ముద్దాయిగా ఉన్న ధనంజయనాయుడుని మాత్రం బొజ్జల బృందమ్మ ప్రత్యేకంగా వేదికపైకి ఆహ్వానించారు. పార్టీకి మొదటి నుంచి కష్టపడుతున్న వారిని పక్కనపెట్టి.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు, కూటమికి చెందిన ఇద్దరు ముగ్గురు నాయకులకు బొజ్జల కుటుంబీకులు ప్రాధన్యత ఇవ్వడంతో టీడీపీ ముఖ్యనాయకులు చాలామంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాయుడుపేటలో వికసించని కమలం
చంద్రబాబు పర్యటనలో నాయుడుపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రసంగించిన సమయంలో టీడీపీ, జనసేన జెండాలు తప్ప కూటమిలో ఉన్న మూడో పార్టీ బీజేపీ జెండా ఒక్కటీ కనబడలేదు. బీజేపీ నేతలకు పిలుపులేకుండా పోవడమే ఇందుకు కారణమని పలువురు గుసగుసలాడారు. తాను అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పడం తప్పితే.. మరో మాటకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం.
సభకు రావడానికి ఇష్టపడని జనం
నాయుడుపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభకు జనాన్ని తరలించేందుకు టీడీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. రెండు రోజులుగా ఊరూరా తిరిగి సభకు రావాల్సిందిగా ప్రాధేయపడ్డారు. సభకు రావడానికి జనం ఇష్టపడకపోవడంతో ఒక్కొక్కరికీ రూ.200, క్వార్టర్ మద్యం , మహిళలకు రూ.200, బిరియానీ ప్యాకెట్లు ఇచ్చి తరలించారు. శ్రీకాళహస్తి సభకు నియోజకవర్గ ప్రజలు రాకపోవడంతో నాయుడుపేట, సత్యవేడు, వెంకటగిరి ప్రాంతానికి చెందిన వారిని తీసుకురావాల్సిన పరిస్థితి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి నిర్వహిస్తున్న సభలు కావడంతో జనం అనూహ్యంగా వస్తారని భావించారు. జనం నుంచి స్పందన లేకపోవడంతో కూటమి నేతలు షాక్ గురయ్యారు.
ఇదేందయ్యా.. చంద్రం !
నాయుడుపేట, శ్రీకాళహస్తి సభల్లో చంద్రబాబు ప్రసంగాన్ని విన్న జనం ఈయనకు చిప్పు చెడినట్టుంది అంటూ నవ్వుకోవడం కనిపించింది. ఇటీవల కుప్పంలో మాట్లాడినట్టే యువత ఇంటివద్ద నుంచే ఉద్యోగం చేసుకునేలా ప్రపంచాన్ని అనుసంధానం చేస్తానన్నారు. నాయుడుపేట సభలో సూళ్లూరుపేట టీడీపీ అభ్యర్థి పేరు తెలియక ఆమెనే అడిగి తర్వాత ఆమె పేరు ప్రస్తావించారు. శ్రీకాళహస్తి సభలో ‘‘వరప్రసాద్‌ను కాదని బీజేపీకి ఓటేస్తే.. వాళ్ల వల్ల ఒరిగేది ఏముంది’’ అని అన్నారు. ఈయనకు కూటమి అభ్యర్థులు ఎవరో తెలియదు.. అంటూ ఆ పార్టీ కార్యకర్తలు సైతం నెత్తి కొట్టుకోవడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment