29న నృసింహునికి చందనాలంకరణ
రాపూరు : పెంచలకోనలో వెలసిన పెనుశిల శ్రీలక్ష్మీనరసింహాస్వామివారు ఈనెల 29వ తేదీన చందనాలంకరణలో దర్శనమివ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ శ్రీవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సుప్రభాతం, శాంతిహోమం, కల్యాణం, బంగారు గరుడసేవ జరిపించనున్నట్లు వెల్లడించారు.
చెంగాళమ్మ సేవలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్
సూళ్లూరుపేట : పట్టణంలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ఆదివారం సేవించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు ఈఓ బి.ప్రసన్నలక్ష్మి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డిని పలువురు బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఏనుగుల దాడిలో పంటల ధ్వంసం
భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట, దిగవూరు, ఎగవూరు పంచాయతీల పరిధిలో శనివారం రాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. వరి పంటతోపాటు చెరుకు, మామిడి తోటలను ధ్వంసం చేసింది. ప్రస్తుతం గజరాజులు భాకరాపేట అటవీప్రాంతంలోకి వెళ్లినట్లు రైతులు చెబుతున్నారు. ఎప్పుడు మళ్లీ పంటలపై పడతాయో అని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించాలని విన్నవిస్తున్నారు.
అన్నమయ్య కీర్తి విశ్వశోభితం
తిరుపతి కల్చరల్: పదకవితా పితామహుడిగా అన్నమయ్య కీర్తి విశ్వశోభితమని ఆచార్య వి.కృష్ణవేణి, సహాయక ఆచార్య వై.విజయలక్ష్మి తెలిపారు. భారతీయ తెలుగు రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో యూత్ హాస్టల్లో ఆదివారం అన్నమయ్యపై జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ ఏకతత్వాన్ని భక్తి తత్వంగా కొలిచిన వాగ్గేయకారుడిగా అన్నమయ్య ప్రసిద్ధి చెందారన్నారు. సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సి.నారాయణస్వామి, జిల్లా అధ్యక్షుడు పాలకూరు కన్నయ్య మాట్లాడుతూ శ్రీవారి లీలను కీర్తించి ముక్తికి భక్తి ముఖ్యమని అన్నమయ్య ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. డాక్టర్ సుభాషిణి, డాక్టర్ కేసీ లావణ్య మాట్లాడుతూ అన్నమయ్య 32 వేల కీర్తనలు రచించారని వెల్లడించారు. ఆముదాల మురళి, రచయిత గొడుగు చింత గోవిందయ్య మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనలు కలియుగాంతం వరకు ఉంటాయన్నారు. అనంతరం కవులకు డాక్టర్ మర్రిపూడి దేవేంద్రరావు అన్నమయ్య జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. డాక్టర్ ఎ.కోమల, డాక్టర్ బత్తుల శ్రీరాములు, డాక్టర్ నందిపాటి చక్రపాణి, ఎం.పురుషోత్తమాచారి, సోము ఉమాపతి, కిట్టన్న, యువశ్రీ మురళి, పద్మ ప్రపూర్ణ, వడ్డి జగదీష్, పవిత్ర, గోవిందన్, పేరూరు బాలసుబ్రమణ్యం, రెడ్డెప్ప, సినీ దర్శకులు బీఏ సోమసుందరం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment