29న మరో ప్రయోగం!
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–15 రాకెట్ ద్వారా నావిక్–02 ఉపగ్రహాన్ని ఈనెల 29న ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. షార్‌లోని మొదటి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో మూడు దశల రాకెట్ అనుసంధానాన్ని పూర్తిచేశారు. రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి శుక్రవారం వ్యాబ్ నుంచి ఉంబ్లికల్ టవర్ (ప్రయోగవేదిక)కు అనుసంధానించే ప్రక్రియను చేపట్టారు. ఈనెల 28న షార్‌లో ఈ ప్రయోగానికి సంబంఽధించి ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కౌంట్‌డౌన్ సమయాన్ని, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగిస్తే జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను మూడు దశల్లోనే ప్రయోగిస్తారు. 50.9 మీటర్ల పొడవువున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–15 రాకెట్ ప్రయోగసమయంలో 420.7 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి బయలు దేరుతుంది. ఈ ప్రయోగంలో 2,250 కిలోల బరువు కలిగిన నావిక్–02 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–15 శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి వందవ ప్రయోగం కావడం విశేషం.
ప్రయోగమిలా..
● నాలుగు స్ట్రాపాన్ ధ్రవ ఇంధన బూస్టర్ల సాయంతో మొదటి దశ ప్రారంభమవుతుంది.
● ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 42.675 టన్నుల ద్రవ ఇంధనం నింపుతారు.
● కోర్ అలోన్ దశలో 138.1 ఘన ఇంధనంతో మొదటి దశను ఘన, ద్రవ ఇంధనాల మిళితంతో 151 సెకెండ్లలో పూర్తి చేస్తారు.
● కోర్‌అలోన్ దశతో కలిపి 308.5 టన్నుల ద్రవ, ఘనఇంధనంతో కలగలిపి మొదటి దశను నిర్వహిస్తారు.
● 42.15 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో రెండో దశను 294 సెకెండ్లకు పూర్తి చేస్తారు.
● క్రయోజనిక్‌దశలో 14.96 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1,140 సెకెండ్లకు మూడో దశను కటాఫ్ చేస్తారు.
● ఆ తరువాత జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–15 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 2,250 కిలోల బరువు కలిగిన నావిక్–02 ఉపగ్రహాన్ని మోసుకెళ్లి 1150.38 సెకెండ్లకు (19.17 నిమిషాలు) 170 కిలో మీటర్లు పెరిజీ (భూమికి అతి దగ్గరగా), 36,577 కిలో మీటర్లు అపోజి (భూమికి దూరంగా) జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీఓ)లోకి ప్రవేశపెట్టనున్నారు.
● అక్కడి నుంచి ఉపగ్రహాన్ని బెంగళూరుకు సమీపంలోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ వారు వారి అధీనంలోకి తీసుకుని ఉపగ్రహంలో నింపిన 1,250 కిలోల ఇంధనాన్ని దశల వారీగా మండించి భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–15 రాకెట్ ప్రయోగానికి సన్నద్ధం
28న ఎంఆర్‌ఆర్ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment