పూత రాలిపోతోంది..నీరుగారుతున్న మామిడి రైతుల ఆశలు | - | Sakshi
Sakshi News home page

పూత రాలిపోతోంది..నీరుగారుతున్న మామిడి రైతుల ఆశలు

Published Wed, Jan 29 2025 12:42 AM | Last Updated on Wed, Jan 29 2025 1:58 PM

-

నీరుగారుతున్న మామిడి రైతుల ఆశలు 

వాతావరణ మార్పులతో విరబూయని పూత 

దిగుబడిపై తీవ్రమైన ప్రభావం  

తోటలు కొనుగోలు చేసిన వ్యాపారుల కలవరం 

పూత రక్షణకు అన్నదాతల ఆపసోపాలు 

తిరుపతి రూరల్‌: మామిడి తోటలు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో తిరుపతి ఒకటి. ప్రధానంగా చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, పాకాల, చంద్రగిరి, రామచంద్రాపురం, పుత్తూరు, వడమాలపేట మండలాల్లో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో 2019 నుంచి 2024 వరకు జిల్లావ్యాప్తంగా రైతులు మామిడి తోటల వైపు మొగ్గుచూపారు. భారీగా రాయితీలు అందించడంతో మామిడి తోటలు విస్తరించాయి. అప్పట్లో వాతావరణం సైతం రైతులకు అనుకూలించడంతో మంచి దిగుబడులు సాధించేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయితీలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే వాతావరణ పరిస్థితులు సైతం వికటించాయి. దీంతో ఇప్పటివరకు జిల్లాలోని 30 శాతం తోటల్లో కూడా పూత రాలేదు.

ఆశ..నిరాశ
జిల్లాలో సాగు చేస్తున్న మామిడి రకాల్లో తోతాపురి తోటలే అధికం. దాదాపు 70శాతం నుంచి 80శాతం వరకు ఈ తోటలే ఉన్నాయి. తోతాపురికి ఓ ప్రత్యేకత ఉంది. ఇవి ఓ ఏడాది బాగా పండితే.. మరో ఏడాది సరిగా కాపునకు రావు. గత సీజన్‌లో తోతాపురి రకం సక్రమంగా దిగుబడి రాలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. అయితే వారికి నిరాశే మిగిలింది. డిసెంబర్‌లో అకాల వర్షాలు కురవడం, దీనికితోడు తీవ్రమైన మంచు పడుతుండడంతో పూత ఆలస్యమైంది. వచ్చిన పూత కూడా బూడిద తెగులు సోకి రాలిపోతోంది. సాధారణంగా పూత బాగా వస్తే ఎకరాకు 7 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ పర్యాయం వాతావరణ ప్రతికూలత కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పూత నిలిచేనా..?
జిల్లాలో 15 రోజుల నుంచి తేనె మంచు ఎక్కువగా కురుస్తోంది. దీంతో మామిడి తోటలు పూతకు రావడం లేదు. ఇప్పటికే రైతులు రెండుసార్లు మందులు పిచికారీ చేశారు, తెగుళ్లు రాకుండా ఉన్న పూత నిలబడడానికి బావిస్టన్‌ వంటి మందులు సైతం వాడారు. ఒకసారి సస్య రక్షణ చర్యలు చేపట్టడానికి ఎకరాకు రూ.7వేల వరకు వెచ్చించారు. ఉన్న పూతను నిలబెట్టుకోవడానికి రైతులు, వ్యాపారులు ఆపసోపాలు పడుతున్నారు. మూడో పర్యాయం కూడా తోటలకు మందులు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికీ తేనె మంచు కురుస్తుండడంతో ఉన్న పూత కూడా నిలబడుతుందో లేదో అని మామిడి రైతులు, వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు.

పూత రాలిపోతోంది
గత ఏడాది మామిడి దిగుబడి సరిగా లేదు. పూత కూడా సక్రమంగా రాలేదు. ఈఏడాది సమయానికి పూత వచ్చి దిగుబడి బాగుంటుందని ఆశించాం. అయితే డిసెంబర్‌లో వచ్చిన వర్షాలు పూత రావడంపై తీవ్రమైన ప్రభావం చూపించాయి. జనవరిలో తేనె మంచు వల్ల అరకొరగా వచ్చిన పూతను నల్లగా మారి రాలిపోతోంది. కనీసం 10 శాతం కూడా పూత నిలవడం లేదు. దీని ప్రభావం దిగుబడిపై ఉంటుంది. ఈ ఏడాది ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
– సుబ్రమణ్యం, రైతు, దుర్గసముద్రం, తిరుపతి రూరల్‌

మందులు వాడాలి
పలు ప్రాంతాల్లో మామిడి పూత రావడం ఆలస్యమవుతోంది. పూత దాని పక్షంలో 13–0–45 రసాయన ఎరువు 10 గ్రాములు, 3 గ్రాముల సల్ఫర్‌, 1.6 ఎంఎల్‌ మోనోక్రోటోపాస్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు పూత రాని తోటల్లో పొగపెట్టాలి. పూత వచ్చిన తర్వాత చెట్లకు ఎరువులు వేసి తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. చీడపీడల నివారణకు సీఎం, క్లోరోపైరిఫాస్‌ 2–ఎంఎల్‌, బోరాన్‌ ఒక గ్రామును లీటరు నీటికి కలిపి ిపిచికారీ చేయాలి. పచ్చి పూత ఉంటే ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 గ్రాములు, హెర్లాకొనజోల్‌ 1 ఎంఎల్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. 

– దశరథరామిరెడ్డి, జిల్లా ఉద్యానశాఖాధికారి, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement