
శ్రీసిటీలో ‘సమ్మర్ క్యాంప్’
శ్రీసిటీ (సత్యవేడు): శ్రీసిటీలో ఈ నెల 9 నుంచి మే 30వ తేదీ వరకు విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నారు. శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు కంపూటర్ కోర్సు, ఇంగ్లిషు గ్రామర్, రైటింగ్ స్కిల్, గణిత సూత్రాలు, పోటీ పరీక్షల మెలకువలు, జనరల్ నాలెడ్జ్, ప్రపంచ వార్తలు తదిర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే యోగా, కరాటే, స్పోర్ట్స్, గేమ్స్ విభాగాల్లో ట్రైనింగ్ అందించనున్నారు. ఈ క్రమంలోనే క్విజ్ పోటీలు, ఇంటరాక్టివ్ సెషన్‌లు నిర్వహించనున్నారు. ప్రాథమిక చికిత్సలపై అవగాహన కల్పించనున్నారు. శ్రీసిటీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో జరిగే క్యాంపునకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత భోజనం సౌకర్యం ఉంటుంది. అలాగే శ్రీసిటీ జీరో సాయింట్, చెరివి కూడలి వరకు ఉచిత వాహనం సదుపాయం కల్పించనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు 833 103 5857 నంబర్‌లో సంప్రదించాలని శ్రీసిటీ అధికారులు సూచించారు.
సుప్రీం కోర్టు ప్రధాన
న్యాయమూర్తికి వీడ్కోలు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుగుప్రయాణమయ్యారు. పలువురు న్యాయమూర్తులు, అధికారులు సాదర వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ శ్రీనివాస శివరామ్, డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి ఈ. భీమారావు, తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి గురునాథ్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ శుభం బన్సల్, జ్యుడీషియల్ ప్రోటోకాల్ సూపరింటెండెంట్ ధనుంజయనాయుడు పాల్గొన్నారు.
ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీకి సాదరంగా..
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్) : జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత్ దాస్ ఆదివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభమ్ బన్సల్ సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు.
11న కలెక్టరేట్ ఎదుట బీసీల నిరసన
తిరుపతి సిటీ : బీసీలకు 52శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈ నెల 11వ తేదీన కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగనున్నట్లు బీఎస్పీ, బీసీ సమన్వయ కమిటీ నేతలు వెల్లడించారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. దేశంలో బీసీలు అధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యత లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపద కేవలం 10శాతం మంది చేతుల్లోనే ఉందని, బీసీలను అగ్రకులాలవారు అణగదొక్కేశారని మండిపడ్డారు. దేశంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీలను అధికారం కోసం వాడుకుని వదిలేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వ ఎన్నికల సమయంలో వడ్డెర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్ వద్ద చేపట్టే నిరసనకు జిల్లాలోని అన్ని కుల సంఘాల నేతలు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం నిరసనకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, నేతలు వేణుగోపాల్ రాజు, శశికుమార్, ధనంజయ, వెంకన్న, బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ బీవీ కేశవులు, నేతలు వి.రమణ, రోశయ్య, విజయభాస్కర్ పాల్గొన్నారు.

శ్రీసిటీలో ‘సమ్మర్ క్యాంప్’

శ్రీసిటీలో ‘సమ్మర్ క్యాంప్’