
జాతీయ స్థాయికి ‘మినీ ఫాస్ట్ కంపోస్టర్ ప్రాజెక్టు’
తిరుపతి ఎడ్యుకేషన్ : కేంద్ర ప్రభుత్వ ఇన్నోవేషన్ సెల్ మంత్రిత్వ శాఖ, అటల్ టింకరింగ్ ల్యాబ్, నీతి ఆయోగ్, జాతీయ సాంకేతిక విద్యామండలి సంయుక్తంగా 2024–25 విద్యాసంవత్సరంలో స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించింది. గత ఏడాది జూలై 29 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాల నుంచి దాదాపు లక్షకు పైగా మోడల్స్‌ను విద్యార్థులు పంపించారు. వీటి నుంచి 1,731 ప్రాజెక్టులు మొదటి దశలో ఎంపికవగా, మన రాష్ట్రం నుంచి 76 ప్రాజెక్టులున్నాయి. అందులో నుంచి తిరుపతి, విజయనగరానికి చెందిన రెండు ప్రాజెక్టులు మాత్రమే ఆర్థిక సాయానికి ఎంపికయ్యాయి. తిరుపతి జిల్లా, వడమాలపేట మండలం, తడుకు ఆర్‌ఎస్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు హేమశ్రీ, గీతిక, వినయ్‌కుమార్ జిల్లా సైన్స్ అధికారి భానుప్రసాద్ మార్గనిర్దేశంలో రూపొందించిన మినీ ఫాస్ట్ కంపోస్టర్ ప్రాజెక్టుకు అభివృద్ధికి రూ.90వేలు ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లో ప్రాజెక్టు రూపకర్తలను, సైన్స్ ఆఫీసర్, డీఈఓ కేవీఎన్.కుమార్‌లను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ అభినందించారు. ఈ ప్రాజెక్టు పనితీరు, ఉపయోగాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుని సమాజాభివృద్ధికి అవసరమయ్యే ఆవిష్కరణలు చేయాలని జేసీ పిలుపునిచ్చారు.
విద్యార్థులను అభినందించిన జేసీ, డీఈఓ

జాతీయ స్థాయికి ‘మినీ ఫాస్ట్ కంపోస్టర్ ప్రాజెక్టు’