అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం

Published Fri, Nov 22 2024 7:28 AM | Last Updated on Fri, Nov 22 2024 7:28 AM

అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం

అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం

ధారూరు: ప్రజాపాలనలో మిగిలిన అన్ని గ్యారంటీలను వచ్చే సంవత్సరం సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తారని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. ధారూరు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో రూ.2.01 కోట్లతో నిర్మించిన రైస్‌మిల్లు, గోదాంలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల కారణంగా మహిళలకు నెలకు రూ.2,500, రైతుబంధు, రుణమాఫీలో జాప్యం జరుగుందని ఆరోపించారు. ఇతర సంక్షేమ పథకాల అమలు చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. వచ్చే సంవత్సరం అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం వచ్చే నెలలోపు అన్ని రకాల పాత బకాయిలను చెల్లిస్తారన్నారు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను సృష్టించాలన్నారు. ఇందుకు పరిశ్రమల ఏర్పాటు, టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులతో పాటు తులం బంగారం ఇచ్చే కార్యక్రమం వచ్చే ఏడాదిలో అమలు చేస్తామని అన్నారు. జిల్లాలోని ప్రాజెక్టుల వద్ద టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అనంతగిరి కొండల్ని రూ.300 కోట్లతో సుందరీకరణ చేయిస్తామన్నారు. అంతకుముందు రైస్‌మిల్లు ప్రారంభోత్సవానికి స్పీకర్‌ను ఎడ్ల బండిపై ఊరేగింపుగా తీసుకువచ్చారు.

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మండి..

ధాన్యం పండించిన రైతులకు తగిన మద్దతు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. ధారూరు, నాగసమందర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ధాన్యంలో మట్టి, చెత్త లేకుండా చేసి, ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలని రైతులకు సూచించారు. సన్నరకం ధాన్యం విక్రయిస్తే రూ.500 బోనస్‌ ఇస్తున్నామని, కొంతమంది అనవసరంగా ఈ విషయంలో రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్‌, ఏఎంసీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు విజయభాస్కర్‌రెడ్డి, ఎల్‌.అశోక్‌ ముదిరాజ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ రాజునాయక్‌, వాలీబాల్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, హరిదాస్‌పల్లి సొసైటీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాములు, డీసీసీబీ డైరెక్టర్‌ కిషన్‌నాయక్‌, నాయకులు రాంచంద్రారెడ్డి, నందు, బాబాఖాన్‌, అవినాశ్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

ధారూరులో రైస్‌మిల్లు ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement