మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ
కందుకూరు: మేకలు మేపడానికి వెళ్లిన ఓ మహిళ మెడలో నుంచి నకిలీ బంగారు పుస్తెలతాడును ఓ దొంగ తస్కరించాడు. గ్రామస్తులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గుమ్మడవెల్లికి చెందిన జగదీశ్వర్ మేకలు మేపుకొంటూ జీవిస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం పని నిమిత్తం గ్రామ సమీపంలో ఉన్న బేగంపేట గ్రామానికి వెళ్లాడు. మేకలను తల్లిదండ్రులు వానరాసి జంగమ్మ, వీరాస్వామికి అప్పజెప్పాడు. దీంతో వారు మేకలను గ్రామ సమీపంలో మేపడానికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీరాస్వామి మేకలకు నీళ్లు తాగించడానికి పక్కనే ఉన్న మామిడి తోటలోకి కొట్టుకెళ్లాడు. ఆ సమయంలో రహదారి పక్కనే ఉన్న పొలంలో జంగమ్మ ఒంటరిగా కూర్చొని ఉంది. గుమ్మడవెల్లి వైపు నుంచి ఓ దుండగుడు బైక్‌పై వచ్చి ఒంటరిగా కూర్చొని ఉన్న ఆమె వద్దకు వచ్చి చిరునామా అడుగుతున్నట్లు నటించి మెడలో ఉన్న రూ.2 వేల విలువ గల నకిలీ బంగారు పుస్తెలతాడును అపహరించుకుపోయాడు. దీంతో ఆమె కుమారుడు జగదీశ్వర్‌కు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అప్రమత్తమైన అతను గ్రామస్తులతో కలిసి బేగంపేటలో ఆ బైక్‌ను అడ్డుకుని దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment