కొత్తూరుతండాలో ఢీకొన్న రెండు బైకులు
కొత్తూరు: రెండు బైకులు ఢీకొని గాయపడిన ఓ వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నర్సింహారావు తెలిపిన వివరాల మేరకు.. కొత్తూరు తండాలో నివాసం ఉంటున్న మంగళి కిశోర్(42) పట్టణంలో హెయిర్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. కాగా శనివారం రాత్రి షాపు మూసిన తర్వాత తన బైకుపై పట్టణం నుంచి ఇంటికి వెళ్తుండగా కొడిచర్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్, సందీప్‌లు ఆయన వెనకాల నుంచి అతి వేగంగా బైకుపై వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కిశోర్ తల, చేతికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మృతి చెందాడు. శ్రీకాంత్, సందీప్‌లకు సైతం గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి సోదరుడు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
చోరీకి గురైన బైక్‌ల అప్పగింత
తలకొండపల్లి: సీసీ కెమెరాల ద్వారా చోరీకి గురైన బైక్‌లను గుర్తించి బాధితులకు పోలీసులు అందజేశారు. ఎస్‌ఐ శ్రీకాంత్ చెప్పిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో శనివారం సంత ఉండడంతో పూల్‌సింగ్ తండాకు చెందిన వ్యక్తి బైక్‌ను పార్క్ చేసి కూరగాయలను కొనడానికి వెళ్లాడు. వచ్చి చూసే సరికి తన బైక్ కనిపించక పోవడంతో, ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి సీసీ కెమెరాల బైక్‌ను గుర్తించి, ఆ వ్యక్తికి పోలీసులు బైక్‌ను అప్పగించారు. అదే విధంగా మండల పరిధిలోని చీపునుంతల్లో ఓ వ్యక్తి ప్రభుత్వ పాఠశాల దగ్గర బైక్ పార్క్ చేశాడు. పని ముగించుకొని వచ్చి చూసే సరికి బైక్ కనపడ లేదు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాల ద్వారా గుర్తించి బైక్‌ను బాధితుడికి అందజేసినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ ఆదివారం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment