ఓవర్‌లోడ్‌తో నిత్యం అవస్థలు
తాండూరు రూరల్: మండల పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీ కరన్‌కోట్ గ్రామం మీదుగా ఓవర్‌లోడ్ లారీలు వెళ్తున్నాయి. గ్రామ శివారులోని క్రషర్ నుంచి నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో లైమ్‌స్టోన్‌ను తరలిస్తున్నారు. ఓవర్‌లోడ్‌తో వెళ్లడంతో కరన్ కోట్ గ్రామంలోని ప్రధాన రోడ్డు ధ్వంసమై పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీల్లో లైమ్ స్టోన్ తరలించే క్రమంలో కనీసం టార్పాలిన్ కూడా కప్పడం లేదన్నారు. లారీల నుంచి వచ్చే దుమ్మూ రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లల్లోకి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మద్యం మత్తులో కిందపడి వ్యక్తి మృతి
ధారూరు: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి కిందపడి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ధారూర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని కుక్కిందకు చెందిన కె.వెంకటయ్య(35) మద్యానికి బానిసై గ్రామంలో తిరిగేవాడు. ఆయన శనివారం రాత్రి మద్యం మత్తులో ధారూర్‌లోని ఓ ఇంటి ఎదుట కింద పడ్డాడు. కొంత సేపటికి స్థానికులు వచ్చి లేపగా ఆయన ఉలుకుపలుకు లేకుండా పడి ఉన్నాడు. గ్రామస్తులు పరీక్షించగా వెంకటయ్య మృతి చెందటంతో తండ్రి అనంతయ్యకు సమాచారం ఇచ్చారు. తాగిన మైకంలో తన కుమారుడు కింద పడి మృతి చెందాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్ తెలిపారు.
రోడ్డుపై ధాన్యం ‘వర్రి’
దౌల్తాబాద్: రహదారులపై వరి ధాన్యాన్ని ఆరబెట్టడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలో ఇటీవల వీటితో ప్రమాదాలు సైతం జరిగాయి. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టవద్దని పోలీసులు హెచ్చరించినా అక్కడక్కడ రైతులు రహదారిపైనే ఆరబెడుతున్నారు. దౌల్తాబాద్ నుంచి కోస్గి వెళే మార్గంలో ఇర్లపల్లి గ్రామ సమీపంలో ఇలా రోడ్డుపై ధాన్యాన్ని ఆరబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment