పత్తి రైతు పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతు పరేషాన్‌

Published Mon, Nov 25 2024 7:40 AM | Last Updated on Mon, Nov 25 2024 7:40 AM

-

షాబాద్‌: ఏటా పత్తి రైతు ఏదో ఒక రకంగా చిత్తవుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి సరైన ధర లేకపోవడం, అకాల వర్షాలు కురుస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. రూ.వేల పెట్టుబడి పెట్టి సాగుచేస్తే ప్రతికూల వాతావరణంలో అంతంత మాత్రమే దిగుబడి వస్తోంది. ప్రస్తుతం వచ్చిన కొద్దిపాటి పంటను అమ్ముకునేందుకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా రైతులకు సరైన అవగాహన లేక దళారులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోతున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌ పత్తికి రూ.7,521 మద్దతు ధరను ప్రకటించగా దళారులు క్వింటాలు పత్తిని రూ.6400 నుంచి రూ.6500 ధరతో కొనుగోలు చేస్తున్నారు.

అనుకూలించని వాతావరణం

సీజన్‌ మొదట్లో పత్తి విత్తనాలు వేసేందుకు అనువైన వర్షాలు పడలేదు. విత్తనాలు వేసినా వర్షాల్లేక రెండు, మూడుసార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. పత్తి పూత దశకు వచ్చిన సమయంలోనూ భారీ వర్షాలు పడ్డాయి. పంట పొలాలు నీట మునిగి పూత, కాయ నేలవాలాయి. నీటిలో మునిగి తెగుళ్లు సోకి దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఈసారి విత్తనాలు, ఎరువుల ధరలు భారీగా పెరిగాయని వాపోతున్నారు.

కూలీల భారం

పంట సాగు చేయడం ఒక వంతు అయితే దాని ఏరివేత రైతులకు ఇబ్బందికరంగా మారింది. పత్తి ఏరివేతకు సరిపడా కూలీలు దొరక్కపోవడంతో అవస్థలు పడుతున్నారు. పత్తి ఏరివేతకు కిలోకు రూ.10 నుంచి రూ.12 కూలీ చెల్లిస్తున్నారు. రైతులు ఆయా గ్రామాలకు వెళ్లి కూలీలను ఆటోలు, ట్రాక్టర్లలో చేలకు తరలిస్తున్నారు. వాహనాల ఖర్చులతో పాటు కిలో పత్తికి రూ.12 వరకు చెల్లించాల్సి వస్తోందని, దీంతో ఆర్థికంగా అదనపు భారం పడుతుందని రైతులు అంటున్నారు.

మోసపోతున్న రైతులు

సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ కొనుగోళ్లలో జాప్యంతో పాటు రైతులకు సరైన అవగాహన లేక రైతులు దళారులకు పంటలను విక్రయిస్తున్నారు. రైతులు ఇంట్లో పత్తి నిల్వ చేసుకోలేక తక్కువ ధరకు ప్రైవేట్‌ వ్యాపారులు, దళారులకు అమ్ముకుంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని దళారులు నాసిరకంగా ఉందని సాకులు చెబుతూ అందినకాడికి దండుకుంటున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి రావడం కూడా కష్టంగా ఉంది.

తగ్గిన పంట దిగుబడి

ధర లేక దిగాలు

దళారులకు అమ్మి నష్టపోతున్న అన్నదాతలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement