ఈవీఎంలపై విస్తృత ప్రచారం అవసరం
వికారాబాద్: ఈవీఎంల పారదర్శకతపై అనుమానం వ్యక్తం చేస్తూ వేసిన ప్రజావ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును విస్తృత స్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్‌జైన్ అన్నారు. బుధవారం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్‌తో కలిసి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తాను ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించే విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పు ద్వారా వెళ్లడించిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలను వినియోగించడంపై ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని తెలిపారు. తాజాగా కోర్టు ఇచ్చి న తీర్పుపై విస్తృత స్థాయి ప్రచారం అవసరమని పేర్కొన్నారు. ఈ తీర్పును అందరు చదవాలి.. చర్చించాలి.. చదువుకున్న వ్యక్తులు ఈ విషయంపై తోటివారికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలపై దేశ పౌరులకు నమ్మకం ఉన్నప్పుడే వ్యవస్థ మరింత పటిష్టమవుతుందన్నారు.
పారదర్శక ఎన్నికలే ఈసీ ఉద్దేశం
సుప్రీం కోర్టు తీర్పుతో ఈవీఎంలపై ఉన్న అనుమానాలన్నీ నివృత్తి అయ్యాయని అన్నారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో 70 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని.. ఇందులో 50 కోట్లకు పైగా ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. ఇంత మంది ఓటర్లు ఉన్న దేశంలో బ్యాలెట్ ద్వారా ఓట్ల లెక్కింపు ఎంతో కష్టమని.. ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో బీయూలు(బ్యాలెట్ యూనిట్లు) వాడాల్సి వస్తుందని.. ఓట్ల లెక్కింపునకు రోజుల తరబడి సమయం పడుతుందని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలన్నదే ఈసీ ఉద్దేశమని కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. ఈవీఎంల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.. రెండు సార్లు ర్యాండమైజేషన్ ఉంటుంది.. ఆ తర్వాత ఏ ఈవీఎం ఏ పోలింగ్ స్టేషన్‌కు వెళుతుందో ఎవరికి తెలియదు.. ఓటింగ్‌కు కొద్ది ముందే రాజకీయ పార్టీల ఏజెంట్లు, పోటీ చేసే వ్యక్తుల సమక్షంలో మాక్ పోలింగ్ కూడా ఉంటుంది.. ఇదంత జరిగాక కూడా ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే ఈవీఎంలు మార్చే వెసులు బాటు కూడా ఈసీ కల్పించిందని తెలిపారు.
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. ఇందుకోసం ప్రణాళికా బద్దంగా వెళ్తున్నట్లు చెప్పారు. ప్రతి అధికారి వారంలో రెండు ప్రభుత్వ పాఠశాలలు సందర్శించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పారిశుద్ధ్యం వంటివాటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. గతంలో గురుకులాల్లో మాత్రమే వాటర్ టెస్టింగ్ కిట్లు ఉండేవని త్వరలో అన్ని పాఠశాలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో మూవీ క్లబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇప్పటి వరకు 176 స్కూళ్లకు స్క్రీన్‌లు, కంప్యూటర్లు అందజేశామన్నారు. త్వరలో వీటిని ప్రారంభిస్తామన్నారు. ప్రేరణాత్మక సినిమాలు విద్యార్థులకు చూపించే ఉద్దేశంతో ఈ మూవీ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో పత్తి, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని తెలిపారు.
సుప్రీం కోర్టు తీర్పును ప్రతిఒక్కరూ చదవాలి
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment