రేపు జాబ్‌మేళా
అనంతగిరి: అపోలో ఫార్మసీలో దాదాపు 50 పోస్టుల భర్తీకి ఈ నెల 29న వికారాబాద్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సుభాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పట్టణంలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్‌మేళా ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9676047444లో సంప్రదించాలని సూచించారు.
ధాన్యం కొనుగోలును
వేగవంతం చేయండి
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర
కుల్కచర్ల: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర ఆదేశించారు. బుధవారం మండలంలోని సాల్వీడు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో వరి కోతలు పూరైన నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మురళీధర్, ఏపీఎం శోభ, సీసీ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు నేరం
న్యాయసేవాధికార సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి డీబీ శీతల్
అనంతగిరి: బాల్య వివాహాలు చేయడం నేరమని న్యాయసేవాధికార సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ అన్నారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలన్నారు. బాల్యవివాహాలు చేసినా.. ఇందుకు సహకరించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. 18 ఏళ్లలోపు అమ్మాయిలకు వివాహం చేస్తే అనేక సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఇద్దరిని సమాన దృష్టితో చూడాలన్నారు. అమ్మాయిలు ఉన్నత చదువుతోనే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరని పేర్కొన్నారు. అందుకు కష్టపడి చదువుకోవాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ ఎయిడ్ న్యాయవాదులు రాము, వెంకటేష్, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కార్మికులకు మౌలిక వసతులు కల్పించండి
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి
మొయినాబాద్: భవన నిర్మాణ కార్మికుల అడ్డాల వద్ద ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి అన్నారు. మొయినాబాద్‌లోని లేబర్ అడ్డాలో బుధవారం భవన నిర్మాణ కార్మికుల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల అడ్డాల వద్ద ప్రభుత్వం తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్స్, రూ.5కే భోజనం వంటి సదుపాయాలను కల్పించాలన్నారు. కార్మికులంతా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల ఇన్‌చార్జి సత్యనారాయణ, సీపీఐ మండల కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు శివయ్య, శంకర్, దర్శన్, రాజు, మల్లేష్, కేశవులు, నర్సింలు, యాదమ్మ, జ్యోతి, కళ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment