సాక్షి, విశాఖపట్నం : భారత్‌ను నడిపించే చోదక శక్తులుగా మారుతున్న టైర్–2 నగరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు.. తమ శాఖల్ని విస్తరించుకుంటున్నాయి. మెట్రో నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతూ.. సకల సౌకర్యాలతో పరిఢవిల్లుతున్న టైర్–2 నగరాల్లో మిన్నగా ఉన్న విశాఖను మొదటి ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటూ తమ సంస్థ కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి.
అద్భుతమైన ఐటీ పాలసీని ప్రవేశపెడుతూ.. మరోవైపు ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్‌గా త్వరలోనే అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నంలో అపారమైన అవకాశాలున్నాయని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రభుత్వం బీచ్ ఐటీ కాన్సెప్ట్‌ని ప్రమోట్ చేసింది. అందుకే అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు విశాఖకు తరలివస్తున్నాయి.
టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్‌ఎస్ మొదలైన ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. తాజాగా ఇన్ఫోసిస్ సంస్థ తన డెవలప్‌మెంట్ సెంటర్ కార్యకలాపాలను మొదలుపెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఇన్ఫోసిస్‌ని ప్రారంభించనున్నారు. తొలి దశలో 1000 మందితో కార్యకలాపాలు ప్రారంభించి దశలవారీగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అడుగులు వేస్తున్న మరిన్ని సంస్థలు
ఇన్ఫోసిస్ మాదిరిగా విశాఖలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు అనేక ఐటీ సంస్థలు ముందుకు వస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2006లో విప్రో క్యాంపస్‌కు స్థలాన్ని కేటాయించారు. 750 మందితో ప్రారంభించాలని భావించినా.. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో 300 మందితో ప్రస్థానం మొదలు పెట్టింది. ఇప్పుడు కార్యకలాపాల జోరు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విప్రో ప్రతినిధులతో చర్చించింది. దశల వారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమని ప్రకటించింది.
వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ని మార్చాలని నిర్ణయించింది. విశాఖలో స్టార్టప్‌ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) సీఈవో సంజీవ్ మల్హోత్రా ప్రకటించారు. అదేవిధంగా ఐటీ రంగంలో తిరుగులేని నగరంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు ఇక్కడే ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా.. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకోసిస్టమ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) సహకారంతో పాటు సంయుక్త సర్టిఫికేషన్ కోర్సుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానెల్‌ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అపారమైన అవకాశాలు
ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్‌గా త్వరలోనే అభివృద్ధి చెందేందుకు విశాఖలో అపారమైన అవకాశాలున్నాయి. ఐటీ పరిశ్రమలన్నీ తమ తదుపరి డెస్టినేషన్‌గా ద్వితీయ శ్రేణి నగరాల్ని ఎంపిక చేసుకుంటున్నాయి. ఐటీ సర్వీస్ సెక్టార్ పరిశ్రమల ఏర్పాటుకు వైజాగ్ వంటి నగరాలే మొదటి ప్రాధాన్యం. ఐటీ సంస్థలకు కావల్సిన మానవ వనరుల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎమర్జింగ్ టెక్నాలజీ, కోర్ ఐటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులపై సంస్థలు దృష్టిసారిస్తూ విశాఖలో కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి.
– కిరణ్‌రెడ్డి, ఎపిటా గ్రూప్ సీఈవో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్
మహానేత వైఎస్ హయాంలోనే..
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే విశాఖలో ఐటీకి అడుగులు పడ్డాయి. మధురవాడలోని మూడు కొండల మధ్య 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సెజ్‌లో తొలిదశలో ఇన్ఫోటెక్, సింబియాసిస్, మిరాకిల్, కెనెక్సా వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు సహా మొత్తం 26 సంస్థలు తరలివచ్చాయి. క్రమంగా సంస్థలు పెరిగాయి. అయితే.. రూ.1800 కోట్లకు చేరుకున్న ఎగుమతులు ఆయన మరణానంతరం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. రూ.1400కి పడిపోయాయి. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలో ఐటీ అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ దృష్టిసారించారు. గత ప్రభుత్వ హయాంలో బకాయి పడ్డ వందకోట్ల ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేశారు. అద్భుతమైన ఐటీ పాలసీని రూపొందించిన ప్రభుత్వం దిగ్గజ సంస్థల్ని ఆకర్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment