సాక్షి, విశాఖపట్నం: ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా జనసైన్యాన్ని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేసింది. ఒకపక్క పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న వారికి కాదని నిన్నగాక మొన్న చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు అనకాపల్లి సీటు ప్రకటించడం, మరోపక్క పొత్తులో కేవలం 24 స్థానాలే జనసేనకు కేటాయించడం వీరిలో తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. చంద్రబాబు కోసం తమను బలి పశువులను చేశారంటూ వీరు లోలోన రగిలిపోతున్నారు. పరుచూరి భాస్కరరావు ఆరేళ్ల నుంచి అనకాపల్లి సీటును ఆశిస్తూ అక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఆయన భారీ మొత్తంలో చేతి చమురు వదిలించుకున్నారు. ఇటీవల నాగబాబు అనకాపల్లిలో నిర్వహించిన సభకు, కశింకోట మండలం విస్సన్నపేట భూముల కేటాయింపు వ్యవహారాల్లో ఆందోళనకు అవసరమైన సొమ్మును ఆయనతోనే ఖర్చు పెట్టించారని చెబుతున్నారు. దీంతో అనకాపల్లి జనసేన అభ్యర్థి ఆయనేనన్న భావన అందరిలోనూ నెలకొంది. ఇంతలో కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన కొణతాలకు అకస్మాత్తుగా సీటు కేటాయించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా తనను ఆర్థికంగా వాడుకుని అన్యాయం చేశారని అనుచరుల వద్ద చెప్పుకుని కన్నీటి పర్యంతమవుతున్నట్టు తెలిసింది.
అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి..
పెందుర్తి స్థానాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆశిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అరకొర సీట్ల పొత్తుతో తమకు దక్కవన్న భయం వీరిని వెంటాడుతోంది. అలాగే ఇటీవలే వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీ వంశీకృష్ణదీ అదే పరిస్థితి. ఆయన ఇన్నాళ్లూ భీమిలి లేదా విశాఖ దక్షిణ సీటును ఆశిస్తున్నారు. తాజా స్థితితో తానూ ఆశలు వదులుకోవల్సి ఉంటుందేమోనన్న ఆందోళనతో ఉన్నారు. ఇక పవన్ 24 సీట్లకే అంగీకరించడాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కూడా తప్పుబడుతున్నారు.
ఇన్నాళ్లూ ఉమ్మడి విశాఖ జిల్లాలో కనీసం నాలుగైదు స్థానాలైనా జనసేనకు కేటాయిస్తారని భావించారు. కానీ పొత్తులో 24 సీట్లే ఇవ్వడం, అందులో ఒకటి కొణతాలకు కేటాయించడంతో రెండో జాబితాలో మరొకరికి మించి ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. అలా ఇచ్చినా గాజువాక లేదా యలమంచిలి స్థానాలను పవన్ సోదరుడు నాగబాబుతో అంటకాగుతున్న సుందరపు బ్రదర్స్‌లో ఒకరికి ఇస్తారు తప్ప పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారికి దక్కదని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ఆ నేతల్లో అంతర్మథనం
టికెట్లను ఆశించి ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలో చేరిన నాయకులు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని చూసి తాము తప్పు చేశామా? అని అనుయాయుల వద్ద అంతర్మథనం చెందుతున్నారు. వ్రతం చెడినా ఫలితం దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర పొత్తుపై జనసేన శ్రేణులు తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు కోసం సీట్ల త్యాగాలు చేసి తమను బలి పశువులను చేశాడని, ఈ కొద్దిపాటి స్థానాలకే చంద్రబాబుకు సరెండర్ అయ్యారని నిప్పులు చెరుగుతున్నారు. తీవ్ర నైరాశ్యం, అసంతృప్తితో వీరు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. జనసేన కార్యాలయాల వైపు కన్నెత్తి చూడడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment