భారతీయ నృత్య వైభవ ప్రతీక
పరంపర నృత్యోత్సవం
ఏయూక్యాంపస్: భారతీయ నృత్య వైభవానికి ప్రతీకగా పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన నిలిచింది. ప్రముఖ స్టెమ్ డ్యాన్స్ సంస్థతో కలిసి ఎం.జి.ఎం పార్క్ ఆవరణలో నిర్వ హించిన ఈ నృత్యోత్సవం విశాఖ వాసులను సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. 2 వేల సంవత్సరాల పూర్వపు భారతీయ నృత్య కళకు ఆధునిక భావాలను మేళవిస్తూ చేసిన ప్రదర్శన కట్టిపడేసింది. కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కార్యక్రమాన్ని ఆద్యంతం తిలకించి.. కళాకారులను అభినందించారు. ముందుగా శ్రీరామ జననం నుంచి రావణ వధ వరకు రామాయణ ఘట్టాన్ని వేదికపై ఎంతో హృద్యంగా ఆవిష్కరించిన విధానం అద్భుతంగా సాగింది. సౌత్ ఇండియాలోని శిల్పకళల నుంచి స్ఫూర్తిని స్వీకరిస్తూ యోగా, కథక్ నృత్యాలను మేళవించి, 2వేల సంవత్సరాల కిందట నాట్య శాస్త్ర పుస్తకాలలో జ్ఞానాన్ని జోడించి చేసిన శివతాండవం కై లాసంలో ఉన్నామనే భావనకు గురిచేసింది. మరొక నృత్యంలో పంచభూతాలను అనుసంధానం చేస్తూ మండల ఉషస్సు నృత్యం భారతీయ వారసత్వం, సంస్కృతిని ఆవిష్కరించింది. 75 ఏళ్ల భారతీయ స్వాతంత్య్ర సంబరాలను పురస్కరించుకుని రూపకల్పన చేసిన రాప్సిడి నృత్యం భారతీయ స్వాతంత్య్రయోధుల కృషిని కళ్లకు కట్టింది. క్రీడలను నృత్యానికి జోడించి చేసిన ప్రదర్శన.. భారతీయ నృత్య వైశిష్ట్యానికి మచ్చుతునకగా నిలిచింది. పరంపర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ నాగి బి.రావు, శశిరెడ్డిలు మాట్లాడుతూ సంప్రదాయ కళారూపాలను ఆధునిక కాలంలో ఏవిధంగా ప్రా ముఖ్యతను సంతరించుకుంటున్నాయో ప్రజలకు తెలియజేయడం తమ లక్ష్యమన్నారు. స్టెమ్ డ్యాన్స్ సంస్థ నిర్వాహకురా లు మధు నటరాజన్ కళారూపాలను వివరించిన విధానం ప్రత్యేకంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment