జూ ఆదాయం రూ.7.64 లక్షలు
ఆరిలోవ: కార్తీకమాసం మూడో ఆదివారం జూ పార్కు.. సందర్శకులతో కిటకిటలాడింది. పిల్లలు, పెద్దలు వన్యప్రాణులను తిలకించడంతో పాటు ఆటపాటలతో సరదాగా గడిపారు. వివిధ రకాల పక్షులు, నల్ల హంసలు, ఖడ్గమృగం, కోతులు, ఏనుగులు, పులులు, జిరాఫీలు, చింపాంజీలు, పాము లు సందర్శకులను అలరించాయి. వీటి వద్ద సందర్శకులు సెల్ఫీలు తీసుకున్నారు. చెట్ల కింద, షెల్టర్లలో కుటుంబ సమేతంగా వనభోజనాలు చేశారు. జాతీయ రహదారి పక్కన ప్రధాన ద్వారం, బీచ్‌రోడ్డులో సాగర్ ద్వారం నుంచి ఆదివారం ఒక్క రోజు 10,006 మంది సందర్శించినట్లు జూ ఇన్‌చార్జి క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. సందర్శకులతో పాటు లోపలకు ప్రవేశించిన కార్ల ద్వారా రూ.7,64,640 ఆదాయం లభించినట్లు ఆమె వెల్లడించారు.
కంబాలకొండకు రూ.65 వేలు..
కంబాలకొండ ఎకో టూరిజం పార్కు ఆదివారం సందర్శకులతో కళకళలాడింది. ఇక్కడ చెట్ల కింద సందర్శకులు వనభోజనాలు చేశారు. విశాలమైన మైదానాల్లో రోజంతా ఆటలతో సరదాగా గడిపారు. ఆట పరికరాల వద్ద పిల్లలు సందడి చేశారు. కంబాలకొండను ఆదివారం 900 మంది సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. వారి ద్వారా రూ.65,000 ఆదాయం లభించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment