త్వరలో డ్రోన్ పెట్రోలింగ్
● పోలీసులు వెళ్లలేని ప్రాంతాల్లోకి డ్రోన్లతో నిఘా ● డిసెంబర్‌లో 67 చోరీ కేసుల ఛేదన.. 91 మంది నిందితుల అరెస్ట్ ● వారి నుంచి రూ.90.53 లక్షల చోరీ సొత్తు స్వాధీనం ● రికవరీ మేళాలో పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి
విశాఖ సిటీ: నేరాల నియంత్రణకు త్వరలోనే డ్రోన్ పెట్రోలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. పోలీసులు వెళ్లలేని ప్రాంతాల్లోకి డ్రోన్లతో నిఘా పెట్టి నేరాల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. డిసెంబర్‌లో 67 చోరీ కేసులను ఛేదించి 91 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరి నుంచి 1.01 కేజీల బంగారం, 2.47 కేజీల వెండి, రూ.12.07 లక్షలు, 10 బైక్‌లు, ఒక ఆటో, 100 మీటర్ల కాపర్ కేబుల్, 315 సెల్‌ఫోన్లు మొత్తంగా రూ.90,53,226 విలువ చేసే సొత్తును రికవరీ చేసినట్లు వెల్లడించారు. చోరీ కేసుల ఛేదనలో క్రైమ్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రతి నెలా రికవరీ రేటు పెరుగుతోందని వివరించారు. సెప్టెంబర్‌లో రూ.86 లక్షలు, అక్టోబర్‌లో రూ.88 లక్షలు, నవంబర్ రూ.89 లక్షలు, డిసెంబర్ రూ.90 లక్షలకు పైగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సంక్రాంతి సమయంలో పోలీసులు నిరంతర నిఘా, ప్రత్యేక పెట్రోలింగ్ కారణంగా నగరంలో హౌస్ బ్రేకింగ్‌లు తగ్గుముఖం పట్టాయన్నారు. 2021లో 12, 2022లో 8, 2023లో 9, 2024లో 12, ఈ ఏడాది సంక్రాంతి సమయంలో కేవలం 3 హౌస్ బ్రేకింగ్‌లు మాత్రమే జరిగాయన్నారు. ఇందులో ఒక కేసును ఛేదించగా..మరో కేసులో ఆధారాలు ఉన్నాయని త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
నవ జీవన నిర్మాణం పేరుతో అవగాహన
సైబర్ నేరాలు ప్రపంచానికి ముప్పుగా మారాయని పేర్కొన్నారు. దీంతో నవ జీవన నిర్మాణం పేరుతో సైబర్ నేరాలు, డ్రగ్స్, మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లి ఆయా అంశంపై యువతకు అవగాహన కల్పిస్తామని తద్వారా కొంత మేర నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మార్చి 31లోగా అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు
నగరంలో నేరాల నియంత్రణ, నిందితుల పట్టివేతకు సీసీ కెమెరాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. స్టేషన్ల వారీగా నేరాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగే హాట్ స్పాట్లను గుర్తించి అక్కడ మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 7 వేల సీసీ కెమెరాలు అందుబాటులో ఉండగా, ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి అన్ని ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీపీ (క్రైమ్) లతా మాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment