మందుల్లేవ్.. మహాప్రభో..!
● కేజీహెచ్‌తోపాటు ప్రధాన ఆస్పత్రుల్లో మందుల కొరత ● గ్లౌజులు, ఇంజక్షన్లు కూడా లేని దుస్థితి ● అత్యవసర మందుల కోసం రోగుల పాట్లు ● గత ప్రభుత్వ హయాంలో నెలరోజులకు సరిపడా మందులు
మహారాణిపేట : ప్రభుత్వ, బోధన ఆస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న కేజీహెచ్‌తోపాటు ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్య శాల, ఈఎన్‌టీ ప్రభుత్వ ఆస్పత్రి, రాణిచంద్రమణి దేవి ఆస్పత్రి, టీబీ, ఐడీ ఆస్పత్రుల్లో మందుల కొరత పట్టిపీడిస్తోంది. వైద్యులు రాసిచ్చిన చీటి పట్టుకొని మందుల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో నెలరోజులకు మందులు ఇవ్వగా ఇప్పుడు వారం రోజులకు.. అదీ అరకొరగా ఇస్తున్నారు. ఇదేమటని అడిగితే స్టాక్ లేదని సిబ్బంది, విజయవాడ నుంచే రావడం లేదు.. ఇండెంట్ పెట్టామని చెబుతూ ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు. దీంతో పేద రోగులు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ఆస్పతుల్లో గ్లౌజులు, ఇంజక్షన్ల కొరత కూడా విపరీతంగా ఉంది. కేజీహెచ్‌లో రోజుకు వందకు గ్లౌజెస్ సెట్లు అవసరం కాగా పది సెట్లకు మించి ఉండడం లేదు. ఒక్కోసారి గ్లౌజులు లేకుండా ఆపరేషన్లు చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు.
రోగుల కిటకిట
సీజన్ మార్పుతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో కేజీహెచ్ కిటకిటలాడుతోంది. కేజీహెచ్‌కు ఉమ్మడి విశాఖ నుంచే కాకుండా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, ఒడిశా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. వైద్యం అనంతరం నెల రోజులకు సరిపడా మందులు రోగులకు ఇచ్చి పంపేవారు. గత ప్రభుత్వ హయాంలో ఈ విధానం కచ్చితంగా అమలయ్యేది. కూటమి ప్రభుత్వం వచ్చాక మందుల కొరత ఏర్పడింది. సోమవారం నుంచి శనివారం వరకు ఇటు ఓపీలు, అటు మందుల కౌంటర్లు రద్దీగా ఉంటాయి. మందుల కోసం వచ్చే రోగులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది.
అన్ని మందులు ఇవ్వడం లేదు
గతంలో నెల రోజులకు సరిపడే మందులు ఇచ్చేవారు. ఇప్పుడు మందుల కొరత ఉండడంతో వారం రోజులకు మించి ఇవ్వడం లేదు. ఇందులో కూడా కొన్ని రకాల మందులు మాత్రమే ఇస్తున్నారు. మిగిలినవి ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆస్పత్రిలో మొత్తం 1,500 రకాల మందులు గతంలో ఉండేవి.. ఇప్పుడు కేవలం 300 రకాలు కూడా లేవని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ పరిస్థితి ఒక్క కేజీహెచ్‌లోనే కాకుండా ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్‌టీ ఆస్పత్రి, రాణి చంద్రమణి దేవి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ ఉంది. క్షతగాత్రులకు డ్రెస్సెంగ్ చేయడానికి అవసరమైన మందులు, సూదులు, కిట్స్ కూడా అందుబాటులో లేవు. ఎవరికై నా డ్రెస్సింగ్ కావాలంటే వారు బయట కిట్ కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.
గతంలో ఆరోగ్యానికి పెద్దపీట
గత ప్రభుత్వ హయాంలో వైద్యం, ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. రోగులకు అన్ని రకాల వైద్య సేవలు చేరువ చేశారు. వైద్యం పూర్తిగా అందించి కోలుకున్నాక.. మందులన్నీ ఇచ్చి మరీ పంపేవాళ్లు. పేదల ఆరోగ్యానికి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భరోసాగా నిలిచింది. ఆ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం రోగులకు చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కూడా ఇవ్వలేని పరిస్థితులున్నాయి. మంచి రోజులు పోయి.. మందులు లేని రోజులు వచ్చాయంటూ రోగులు ఉసూరుమంటున్నారు.
మందులు నిల్ – కౌంటర్లు కిటకిట
కేజీహెచ్‌తోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఇచ్చే కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. కాని అక్కడ మందుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో రోగులు నిరాశ చెందుతున్నారు. వైద్యులు రాసిన అన్ని మందులు దొరకడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు మెడికల్ షాపుల్ల్లో మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పేదలకు ఆర్థిక భారం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment