కూల్చిన చోటే నీడ కల్పించాలి
● బాధితుల వేడుకోలు
బొండపల్లి: తమకు అసరాగా 13 సంవత్సరాలుగా ఉన్న రేకుల షెడ్డును తొలగించిన స్థానంలోనే తనకు నీడను కల్పించాలని కోరుతూ బాధిత కుటుంబం అక్కడే చలిలోనే నాలుగు రోజులుగా కాలం వెళ్లదీస్తున్నారు. మండలంలోని గొల్లలపేట గ్రామానికి చెందిన పీతల చంటిబాబు గ్రామానికి సమీపంలో రేకుల షెడ్డును సెంటున్నర స్థలంలో 13 సంవత్సరాల క్రితం వేసుకుని అక్కడే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్డు వేసుకున్నాడని చెప్పి నోటీసులు జారీ చేసి షెడ్డును పొక్లెయిన్‌తో బలవంతంగా తొలగించారు. కేవలం రాజకీయ కారణాలతోనే తన షెడ్డును తొలగించారని ఇదే సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి అని చెబుతున్న దానిలో నీలగిరి మొక్కలు వేసుకుని సాగు చేస్తున్న రైతును ఎందుకు తొలగించలేదని, అలాగే మండలంలో చాలా చోట్ల అక్రమణలు ఉన్నా తనపై కక్షగట్టి తొలగించడం దారుణమని వాపోతున్నాడు. తనకు న్యాయం చేసి తాను రేకుల షెడ్డు వేసుకుని జీవనం సాగిస్తున్న చోటనే తనకు నీడ కల్పించాలని కోరుతూ బాధితుడు కుటుంబంతో సహా అక్కడే రాత్రీపగలు చలిలో కాలం వెళ్ల దీస్తున్నాడు. ప్రభుత్వం, అధికారులు తనకు న్యాయం చేయాలని లేకుంటే అంతవరకు షెడ్డు తొలగించిన స్థలం నుంచి కదిలేది లేదని తెగేసి చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment